స్వార్థం, అధికార దాహం కోసం ఎవరినైనా బలిచేసే వ్యక్తి జగన్: పార్థసారథి

YS Jagan Mohan Reddy sacrifices anyone for selfishness and power says Parthasarathy
  • అధికారులు, పారిశ్రామికవేత్తలను జైలుపాలు చేసిన చరిత్ర జగన్ ది అన్న పార్థసారథి
  • జగన్ కారణంగా ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి జైలు జీవితం తప్పలేదని వ్యాఖ్య
  • శ్రీనివాసన్ వంటి పారిశ్రామికవేత్తలను కూడా వివాదాల్లోకి లాగేశారని విమర్శ

వైసీపీ అధినేత జగన్ పై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తన స్వార్థం, అధికార దాహం కోసం ఎవరినైనా బలి చేయడానికి వెనుకాడరని... అధికారులు, పారిశ్రామికవేత్తలను జైలుపాలు చేసిన ఘోరమైన చరిత్ర ఆయనదని మండిపడ్డారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక అధికారుల జీవితాలతో జగన్ ఆడుకున్నారని ఆరోపించారు. గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో జగన్ అక్రమ వ్యవహారాల వల్ల మహిళా ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి జైలు జీవితం తప్పలేదని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.


అధికారాన్ని వాడుకుని ఎంతటివారితోనైనా అనైతిక పనులు చేయించగల నైజం మాజీ సీఎంది అని మంత్రి ధ్వజమెత్తారు. సొంత రాజకీయ లబ్ధి కోసం అమాయకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన తీరుకు నటి జత్వానీ ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఊహించని రీతిలో భారీ అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు హయాంలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి వ్యవస్థలను దిగజార్చారని, జగన్ కనుసన్నల్లోనే అధికారులను పావులుగా వాడుకుని ఏపీపీఎస్సీలో కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. విశాల్ గున్ని, కాంతి రాణా వంటి పోలీసు అధికారులను తన స్వార్థానికి వాడుకుని వారిని బలిపశువులను చేశారని విమర్శించారు.


జగన్ రెడ్డి దోపిడీ రాజకీయాలకు లోబడి పనిచేసిన పలువురు అధికారులు, నాయకులు తమ కెరీర్‌లను నాశనం చేసుకున్నారని మంత్రి పార్థసారథి వ్యాఖ్యానించారు. ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలను కూడా వివాదాల్లోకి లాగి చిక్కుల్లో పడేశారని, వైసీపీ దోపిడీకి సహకరించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. 


జగన్ మాట విని తప్పుడు పనులు చేసిన అధికారులు, నాయకులు చివరకు తీవ్ర విమర్శలు, అవమానాల పాలయ్యారని తెలిపారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి అనేక మంది జీవితాలను నాశనం చేసిన జగన్ వైఖరిని ప్రజలంతా గమనించాలని చెప్పారు.

Advertisement
YS Jagan Mohan Reddy
Kolusu Parthasarathy
Andhra Pradesh Politics
YSRCP Corruption Allegations
APPSC Recruitment Scam
Kadambari Jethwani Case

More Telugu News