శ్రీవారి దర్శనానికి భారీ నిరీక్షణ.. నిండిపోయిన క్యూ కాంప్లెక్స్‌లు

Tirumala Srivari Darshan heavy rush as queue complexes are full
  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం
  • నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, బయట బారులు
  • గురువారం రూ.4.45 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తడంతో తిరుమల కొండపై రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో, భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, టైమ్‌స్లాట్ టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 20 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల సౌకర్యార్థం టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.

ఇక నిన్న (గురువారం) మొత్తం 66,437 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, వారిలో 26,771 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.45 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.                                
Advertisement
Tirumala Srivari Darshan
Tirupati Temple rush
TTD queue status
Vaikuntam Queue Complex
Tirumala pilgrimage update
Tirupati hundi income

More Telugu News