అమరావతి అసెంబ్లీ భవన నిర్మాణంపై ఉన్నతస్థాయి సమీక్ష .. అధికారులకు స్పీకర్ కీలక ఆదేశాలు

Amaravati Assembly building construction high level review Speaker issues key orders to officials
  • అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని స్పీకర్ ఆదేశం
  • 265 మంది ఎమ్మెల్యేలు, 110 మంది ఎమ్మెల్సీల కోసం ఏర్పాట్లు
  • నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో అధికారుల భేటీ
  • ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామన్న మంత్రి మనోహర్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శాసనసభ భవన నిర్మాణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో భవన నిర్మాణ ప్రణాళికలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు పి. నారాయణ, నాదెండ్ల మనోహర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ సహా ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. ఐకానిక్ భవనాల రూపకల్పన బాధ్యత వహించిన ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ 'నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్' ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొని డిజైన్లను వివరించారు. ఇంటీరియర్ డిజైన్, సభ్యుల సీటింగ్ సామర్థ్యం, అత్యాధునిక డిజిటల్ సాంకేతికత, భద్రతా వ్యవస్థలు, పార్కింగ్, సందర్శకుల సౌకర్యాలపై ఈ సందర్భంగా కూలంకషంగా చర్చించారు.

భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పెరగనున్న సభ్యుల సంఖ్యకు అనుగుణంగా 265 మంది ఎమ్మెల్యేలు, 110 మంది ఎమ్మెల్సీలు కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశాల నిర్వహణ కోసం విశాలమైన సెంట్రల్ హాల్‌తో పాటు, సందర్శకులకు అసెంబ్లీ విశిష్టతను వివరించేలా ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, భవనం వద్ద అండర్‌గ్రౌండ్ పార్కింగ్ సౌకర్యం కల్పించి, దానిపై ఆహ్లాదకరమైన ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయనున్నారు. సమీక్ష అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు.                                
Advertisement
Amaravati Assembly
Chintakayala Ayyanna Patrudu
Andhra Pradesh Capital Construction
Norman Foster and Partners
Nadendla Manohar
Amaravati Iconic Buildings

More Telugu News