గల్లంతైన మత్స్యకారులు బెంగాల్ తీరంలో గుర్తింపు.. చంద్రబాబు హర్షం

Missing fishermen safe found at West Bengal coast CM Chandrababu Naidu happy
  • కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యం
  • పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా ఉన్నట్లు గుర్తింపు
  • సాంకేతిక లోపంతో సముద్రంలో కొట్టుకుపోయిన బోటు
  • గాలింపు బృందాలను అభినందించిన సీఎం చంద్రబాబు
  • జాలర్లను స్వస్థలాలకు తీసుకురావాలని అధికారులకు ఆదేశం
సముద్రంలో గల్లంతైన కోనసీమ జిల్లా మత్స్యకారుల గాలింపు చర్యలు సుఖాంతమయ్యాయి. వేటకు వెళ్లి ఆచూకీ లభించకుండా పోయిన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరానికి సురక్షితంగా చేరుకున్నారు. ఈ సమాచారం తెలియగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ, గాలింపు చర్యల్లో అహర్నిశలు శ్రమించిన అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని అభినందించారు.

ఈ నెల 3వ తేదీన కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి ఏడుగురు మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లారు. అయితే, మార్గమధ్యలో బోటులో సాంకేతిక లోపం తలెత్తడంతో అది మధ్యలోనే నిలిచిపోయింది. బలమైన గాలుల ప్రభావంతో వారి బోటు పశ్చిమ బెంగాల్ తీరం వైపు కొట్టుకుపోయింది. నిర్ణీత గడువు ముగిసినా వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలైంది.

ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించి, గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా మంత్రులను రంగంలోకి దింపి గాలింపు ప్రక్రియను పర్యవేక్షించారు. బోటు బెంగాల్ వైపు కొట్టుకుపోయి ఉండవచ్చని అంచనా వేసిన ప్రభుత్వం, అక్కడి కోస్ట్ గార్డ్, శంకర్‌పూర్ ఫిషింగ్ హార్బర్‌లోని స్థానిక మత్స్యకారులను అప్రమత్తం చేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ విభాగాల సహాయాన్ని కూడా తీసుకున్నారు.

ప్రభుత్వం చేపట్టిన ముమ్మర ప్రయత్నాలు ఫలించి, శంకర్‌పూర్ సమీపంలో బోటుతోపాటు ఏడుగురు మత్స్యకారులను గుర్తించారు. వారి ఆచూకీ లభించిన వెంటనే ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. మత్స్యకారులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.
Advertisement
Nara Chandrababu Naidu
Konaseema fishermen
West Bengal coast
Missing fishermen found safe
Andhra Pradesh news
Shankarpur fishing harbor

More Telugu News