‘లైఫ్‌స్టైల్‌ ఇన్‌ఫ్లేషన్‌’: నేటి యువతరాన్ని పేదవారిగా మార్చుతున్న ఆర్థిక తప్పులు

Lifestyle Inflation Financial mistakes making today youth poor
  • జీతం పెరిగిన కొద్దీ ఖర్చులు పెరగడమే లైఫ్‌స్టైల్‌ ఇన్‌ఫ్లేషన్‌
  • పెద్ద ఇల్లు, కారు, పర్యటనలతో నెలవారీ భారం
  • జీతం పెంపును ఈఎంఐలకు మళ్లించడం పెద్ద తప్పిదం
  • ఆదాయం పెరిగినా పొదుపు రేటు పెరగకపోతే సంపద పెరగదు
  • పెరుగుతున్న ఈఎంఐలు ఆర్థిక ప్రమాదానికి తొలి సంకేతం
జీతం పెరిగింది. జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి. కానీ బ్యాంకు ఖాతాలో మాత్రం పొదుపు పెరగలేదు. నేటి ఉద్యోగుల్లో పెరుగుతున్న ఈ ధోరణినే ‘లైఫ్‌స్టైల్‌ ఇన్‌ఫ్లేషన్‌’గా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆదాయం పెరిగిన ప్రతిసారీ ఖర్చులు కూడా పెంచుకోవడం.. దీర్ఘకాలంలో సంపద సృష్టికి పెద్ద అడ్డంకిగా మారుతోంది.

పెరిగేది జీతమే కాదు.. ఖర్చూ!
సాధారణ ద్రవ్యోల్బణం వల్ల అదే జీవనశైలిని కొనసాగించేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. లైఫ్‌స్టైల్‌ ఇన్‌ఫ్లేషన్‌లో మాత్రం మన జీవనశైలినే ఖరీదైనదిగా మార్చుకుంటాం.

నెలకు రూ.50 వేలు ఖర్చు చేసే వ్యక్తికి ఐదేళ్ల తర్వాత అదే జీవనశైలికి దాదాపు రూ.67 వేలు అవసరం కావచ్చు. అదే సమయంలో పెద్ద ఇల్లు, ఖరీదైన కారు, విదేశీ పర్యటనలు, పెరిగిన విలాస ఖర్చులు చేరితే నెలవారీ వ్యయం రూ.లక్ష దాటే అవకాశం ఉంది.

ఇంక్రిమెంట్‌.. కొత్త ఖర్చులకు దారి!
జీతం పెరిగితే ఆ మొత్తాన్ని పెట్టుబడుల వైపు మళ్లించడం కంటే కొత్త కారు ఈఎంఐ, ఖరీదైన విహారయాత్రలు, సబ్‌స్క్రిప్షన్లకు ఖర్చు చేయడం చాలామందిలో కనిపిస్తోంది.

ఆదాయం పెరిగినా పొదుపు మాత్రం పెరగకపోతే సంపద పెరగదు. రూ.30 లక్షల వార్షిక వేతనం ఉన్నా భవిష్యత్తుకు సరిపడా ఆర్థిక భద్రత ఉండకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ 3 సంకేతాలు ప్రమాద ఘంటికలు
ప్రతి జీతం పెంపుతో కొత్త ఈఎంఐ పెరగడం తొలి హెచ్చరిక. అద్దె, రుణ వాయిదాలు, సబ్‌స్క్రిప్షన్ల వంటి స్థిర ఖర్చులు పెరగడం రెండో సంకేతం. నెల చివర మిగిలితే పెట్టుబడి పెడదామనే ఆలోచన మూడో ప్రమాదం.

ముందుగా పొదుపు.. తర్వాత ఖర్చు
ఆదాయం పెరిగినప్పుడు ముందు పెట్టుబడులను పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. తర్వాత మిగిలిన మొత్తంతో ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలి. సంపన్నంగా కనిపించడం కంటే ఆర్థిక స్వేచ్ఛ సాధించడమే అసలైన విజయం అని చెబుతున్నారు.
Advertisement
Lifestyle Inflation
Financial Mistakes
Wealth Creation
Personal Finance Tips
Savings and Investment
Financial Freedom

More Telugu News