హిజాబ్ తీర్పు ఇస్లాంపై దాడి.. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్

Asaduddin Owaisi slams Allahabad High Court calling Hijab verdict an attack on Islam
  • హిజాబ్ తీర్పుపై అలహాబాద్ హైకోర్టును తీవ్రంగా విమర్శించిన ఒవైసీ
  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 19లకు విరుద్ధమని వ్యాఖ్య
  • ఆరెస్సెస్, బీజేపీలకు రాజ్యాంగం కంటే మనుస్మృతే ఇష్టమని ఆరోపణ
  • యూసీసీ పేరుతో హిందూ చట్టాలను ఇతర మతాలపై రుద్దుతున్నారని విమర్శ
  • దేశాన్ని ప్రేమిస్తాం, కాపాడుకుంటామని స్పష్టం చేసిన ఎంఐఎం అధినేత
పాఠశాల యూనిఫామ్‌తో పాటు హిజాబ్ ధరించడానికి అనుమతి కోరిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లోని దారుస్సలాంలో జరిగిన 'జల్సా-ఎ-రహ్మతుల్-లిల్-అలమీన్' సభలో ఆయన మాట్లాడుతూ, ఈ తీర్పు ఇస్లాంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.

ఈ తీర్పుతో తాను ఏకీభవించనని, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 19లను ఉల్లంఘించడమేనని ఒవైసీ అన్నారు. "ఇస్లాంలో ఏది అవసరమో, ఏది కాదో నిర్ణయించడానికి మీరెవరు? అమ్మాయిలు హిజాబ్‌ను తలపై ధరిస్తారు కానీ, మెదడుపై కాదు" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. శబరిమల కేసులో మతపరమైన ఆచారాలపై సుప్రీంకోర్టులో విచారణ ఇంకా పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా ఆరెస్సెస్, బీజేపీలపై కూడా ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. వారికి భారత రాజ్యాంగం కంటే మనుస్మృతే ఎక్కువ ఇష్టమని, బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని వారు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్‌పై విమర్శలు చేస్తూ, అండమాన్ జైలులో ఆయన బ్రిటిష్ వారికి క్షమాపణ లేఖలు రాశారని, కానీ ముస్లిం స్వాతంత్ర్య సమరయోధులు మాత్రం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జిహాద్‌కు ఫత్వా జారీ చేసి, కఠిన శిక్షలు అనుభవించారని పోల్చారు. అండమాన్ జైలుకు వెళ్లిన మొదటి ఖైదీ హైదరాబాద్ మక్కా మసీదు ఇమామ్ మౌల్వీ అలావుద్దీన్ అని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్, అసోం, గుజరాత్‌లలో అమలు చేస్తున్న యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)పై కూడా ఒవైసీ స్పందించారు. హిందూ వివాహ, విడాకులు, వారసత్వ చట్టాల ఆధారంగా రూపొందించిన చట్టాలను యూసీసీ అని ఎలా అంటారని, వాటిని ముస్లింలపై ఎందుకు రుద్దాలని ప్రశ్నించారు. తమను తమ మతం నుంచి దూరం చేయాలని చేసే ప్రయత్నాలు ఫలించవని, తాము ఖురాన్‌ను అనుసరిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తాము ఈ దేశాన్ని ప్రేమిస్తామని, దేశాన్ని కాపాడుకుంటూనే భారత్‌ను సూపర్ పవర్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని ఒవైసీ పేర్కొన్నారు.
Advertisement
Asaduddin Owaisi
Allahabad High Court Hijab Verdict
Hijab Ban Controversy
Uniform Civil Code
AIMIM Chief News
Article 25 Religious Freedom

More Telugu News