ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేరు కానీ.. విదేశీ విద్య అందిస్తారంట!: బండి సంజయ్
- కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన బండి సంజయ్
- ఫీజు బకాయిలు అందకపోవడంతో విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారన్న ఆవేదన
- బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్న సంజయ్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని... అలాంటప్పుడు విదేశీ విద్యను అందిస్తామని, ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
ఒకేసారి (వన్ టైం సెటిల్‌మెంట్) బకాయిలన్నీ చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. హామీలు ఇచ్చి మోసం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ సర్కార్‌ను మించిపోతోందని విమర్శించారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తలెత్తే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.