పృథ్వీ రాజ్ సుకుమార్ కథానాయకుడిగా నటించిన మలయాళ సినిమానే 'ఐ, నోబడీ'. సుప్రియ మీనన్ నిర్మించిన ఈ సినిమాకి నిస్సామ్ బషీర్ దర్శకత్వం వహించాడు. పార్వతీ తిరువోతు .. హకిమ్ షాజహాన్ .. అశోకన్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, జులై 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు నుంచి ఈ సినిమా 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ అందుబాటులోకి వచ్చింది.
రాజీవ్ (పృథ్వీరాజ్ సుకుమార్) ఓ ప్రభుత్వ ఉద్యోగి. భార్య మీరా (పార్వతి తిరువోతు) పిల్లలు జోయా (నక్షత్ర) అమల (ఐరా) ఇదే అతని ఫ్యామిలీ. కొంతకాలంగా రాజీవ్ కీ .. అతని భార్యకి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే అతను ఒక బ్యాంకుకి వెళతాడు. అయితే అదే సమయంలో ముగ్గురు దొంగలు ఆయుధాలతో ఒక్కసారిగా విరుచుకుపడతారు. రాజీవ్ కళ్లముందే 17 కోట్ల రూపాయలను దోచుకుంటారు. తమతో గొడవపడిన అతనికి ముసుగువేసి తమతో పాటు తీసుకుని వెళతారు.
పోలీసులు వెంటాడుతూ ఉండటంతో ఆ దొంగలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు దొంగలు చనిపోతారు. ప్రాణాలతో బయటపడిన రాజీవ్ ను హాస్పిటల్లో చేరుస్తారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో డబ్బు లేకవడంతో పోలీసులు ఆలోచనలో పడతారు. ఈ వార్త బయటికి రావడంతో, ఆ డబ్బు ఏమై ఉంటుందనేది చర్చనీయాంశమవుతుంది. ఆ ప్రమాదం జరిగిన పరిసరాలలో ఆ డబ్బు కోసం వెదకడంలో జనాలు పోటీపడుతుంటారు.
రాజీవ్ ఆ డబ్బును మాయం చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తారు. ముఖ్యంగా సస్పెన్షన్ లో ఉన్న 'అనస్' (హకీమ్ షాజహాన్) ఎక్కువగా అనుమానపడుతుంటాడు. ఇక ముగ్గురు దొంగలకు సంబంధించిన వాళ్లు కూడా రాజీవ్ పై ఒక కన్నేసి ఉంచుతారు. జనమంతా కూడా ఆ డబ్బు అతని దగ్గరే ఉండొచ్చని భావిస్తుంటారు. చివరికి రాజీవ్ చిన్న యాక్సిడెంట్ చేసినా, లక్షలు డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఒక పరిస్థితి నుంచి బయటపడటానికి రాజీవ్ ఏం చేస్తాడు? తనకి ఎకౌంట్ లేని బ్యాంకుకి తాను ఎందుకు వెళ్లాడు? దొంగలు దోచేసిన ఆ డబ్బు ఏమైపోయింది? అనేది మిగతా కథ.
'నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వెవిడికి కావలి' అనే ఒక డైలాగ్ ఈ సినిమాలో ఉంది. ఒక రకంగా ఈ కథ మొత్తానికి ఇది 'కీ' డైలాగ్ గా చెప్పుకోవచ్చు. బ్యాంకు నుంచి దోచుకోబడిన 17 కోట్ల రూపాయలు రాజీవ్ దగ్గర ఉన్నాయని అంతా భావిస్తుంటారు. అంత డబ్బు అతను ఏం చేశాడు? ఎక్కడ దాచాడు? అనే ఒక అంశం చుట్టూనే ఈ కథ అంతా తిరుగుతూ ఉంటుంది. అంత డబ్బు ఉన్న అతనిని అందరూ ఏ దృష్టితో చూస్తుంటారు అనే ఒక పాయింట్ ను దర్శకుడు తయారు చేసుకున్న పద్ధతి బాగుంది.
సాధారణంగా రోడ్డుపై ఏదైనా పండ్ల లారీలాంటిది పడిపోతే, ఆ ప్రమాదం బారిన పడినవారిని ఎవరూ పట్టించుకోరు. ఎవరికి దొరికిన పండ్లు వాళ్లు పట్టుకుపోతుంటారు. అలాగే ఒక బ్యాంకు దోపిడీ జరిగితే ఎవరూ కూడా అయ్యో అనుకోరు. ఆ సొమ్మును దోచేసిన వ్యక్తి నుంచి ఎంతో కొంత రాబట్టుకోవాలనే ఆశతో ఎవరికి వారు ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది.
బ్యాంకు నుంచి పోయిన డబ్బు కోసం ఒక వైపున పోలీసులు .. ఒక వైపున దొంగల కుటుంబ సభ్యులు .. మరొక వైపున జనాలు హీరోను వెంటాడటం .. వేటాడటం ఆసక్తికరంగా అనిపిస్తాయి. డబ్బు ఏం చేయగలదు అనే ప్రశ్నకు ఏమైనా చేయగలదు అనే ఆన్సర్ దొరికేలా చేస్తుంది. అలాగే తనకి ఎకౌంట్ లేని బ్యాంకు కి హీరో వెళ్ళడానికి గల కారణం కూడా సబబుగా అనిపిస్తుంది. ఇక భార్యాభర్తలు ప్రేమతో ఉన్నప్పుడే, వాళ్ల పిల్లలు మానసికంగా బలంగా ఉంటారనే ఒక సందేశం కూడా ఈ కథలో కనిపిస్తుంది.
పృథ్వీ రాజ్ సుకుమార్ .. పార్వతి తిరువోతుతో పాటు ఆర్టిస్టులంతా చాలా సహజంగా నటించారు. కథ స్క్రీన్ ప్లే .. పాత్రలను మలచిన తీరు ఆకట్టుకుంటుంది. ఏ సన్నివేశాన్ని చూసినా సినిమా కాబట్టి ఇలా జరిగింది అనిపించదు. వాస్తవ పరిస్థితులకు తగినట్టుగానే సన్నివేశాలు కనెక్ట్ అవుతూ వెళతాయి. దినేశ్ పురుషోత్తమన్ ఫొటోగ్రఫీ .. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం .. రమీస్ ఎడిటింగ్ పనితీరు మెప్పిస్తాయి.
ఒక సాధారణ వ్యక్తి ఏదైనా ఒక సంఘటన బారిన పడితే, పోలీసులు ఎంత లైట్ తీసుకుంటారు. మీడియా .. పబ్లిక్ అతని పట్ల ఎలా వ్యవహరిస్తారు? రాజకీయనాయకులు తమకి అనుకూలంగా ఆ సంఘటనను ఎలా మార్చుకుంటారు? వంటి సంఘటనలతో ఈ కంటెంట్ ఆలోచింపజేస్తుంది .. ఆసక్తికరంగా అనిపిస్తుంది.
'ఐ, నోబడీ' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!
I, Nobody Review
Movie Details
Movie Name: I, Nobody
Genre: Action, Thriller
Release Date: 2026-08-25
Cast: Prithviraj Sukumaran, Parvathy Thiruvothu, Hakim Shahjahan, Ashokan, Madhupal, Vijayaraghavan
Director: Nissam Basheer
PRO: -
Music: Jakes Bejoy
Banner: Prithviraj Productions
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer