జగన్ తనను తాను కాపాడుకోవడానికి బీసీ నేతలను ఇరికిస్తున్నారు: యనమల
- బీసీలను జగన్ మోసం చేస్తున్నారన్న యనమల
- తన రాజకీయ అవసరాల కోసం బీసీలను మోసం చేస్తున్నారని మండిపాటు
- బలహీన వర్గాలు రాజకీయంగా బలోపేతం కావడం జగన్ కు ఇష్టం లేదని వ్యాఖ్య
వైసీపీ అధినేత జగన్ వైఖరిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బలహీన వర్గాలను, ముఖ్యంగా బీసీలను జగన్ నిరంతరం మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
జగన్ అవలంబిస్తున్న విధానం ప్రధానంగా రెండు కోణాల్లో సాగుతోందని యనమల ధ్వజమెత్తారు. మొదటిది, తన రాజకీయ అవసరాల కోసం బీసీలు సహా బలహీన వర్గాలను బలిపశువులను చేయడం. రెండవది, మద్యం కుంభకోణం వంటి భారీ అవినీతి కేసుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి, వైసీపీలోని బీసీ నాయకులపైకి ఆ నిందలు తోసి వారిని నేరాల్లో ఇరికించడం అని ఆయన ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం కావడం జగన్‌కు అస్సలు ఇష్టం లేదని యనమల స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆరంభం నుంచి బీసీలకు అండగా నిలుస్తూ వారికి వెన్నుముకగా ఉంటూ వస్తోందని, వారి సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.