అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu inspects Net Zero policy in Alavaram Koduru photos included
  • నెట్‌జీరో గ్రామమే లక్ష్యం.. అలవరం కోడూరులో సీఎం చంద్రబాబు పర్యటన
  • పర్యావరణ పరిరక్షణను ఇంటింటి ఉద్యమంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి
  • వంటగది వ్యర్థాలతో సేంద్రియ ఎరువు, మురుగునీటికి ఇంటి వద్దే పరిష్కారాలు
  • సౌర విద్యుత్‌తో ఇండక్షన్ స్టవ్‌ వినియోగం ద్వారా గ్యాస్, కరెంట్ ఆదా
  • ఆదర్శంగా నిలుస్తున్న నెట్‌జీరో విధానాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళిక
పర్యావరణ పరిరక్షణను ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఇంటింటి ఉద్యమంగా మార్చి, గ్రామాలను స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు 'నెట్‌జీరో' విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించి, పర్యావరణహిత జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. శనివారం 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని అలవరం కోడూరు గ్రామంలో సీఎం పర్యటించారు.

ఈ సందర్భంగా, గ్రామంలో అమలు చేస్తున్న నెట్‌జీరో కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటింటా సౌర విద్యుత్ వినియోగం, పరిశుభ్రమైన వంట విధానాలు, తడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ, మురుగునీటిని ఇంటి వద్దే శుద్ధి చేయడం వంటి పద్ధతుల ద్వారా గ్రామాలను ఎలా ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారో తెలిపారు.

క్షేత్రస్థాయిలో కార్యక్రమాల పరిశీలన
కార్యక్రమం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు, గ్రామానికి చెందిన జె. మహేశ్వరరావు ఇంటిని సందర్శించారు. మహేశ్వరరావు కుటుంబం చేపడుతున్న పర్యావరణహిత కార్యక్రమాలను సీఎం ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. వంటింటి నుంచి వెలువడే తడి వ్యర్థాలను ప్రత్యేక కంపోస్ట్ గుంతలో వేసి సేంద్రియ ఎరువుగా మార్చుతున్న విధానాన్ని వారు ముఖ్యమంత్రికి చూపించారు. దీనివల్ల ఎరువుల ఖర్చు తగ్గడమే కాకుండా, వ్యర్థాల నిర్వహణ భారం కూడా తగ్గుతుందని వివరించారు.

అలాగే, ఇంటి నుంచి వెలువడే మురుగునీటిని బయటకు వదలకుండా, ఆవరణలోనే నిర్మించిన ఇంకుడు గుంతలోకి మళ్లిస్తున్న విధానాన్ని సీఎం పరిశీలించారు. ఈ 'ఇన్‌సిటు వేస్ట్‌వాటర్‌ మేనేజ్‌మెంట్‌' వల్ల రోడ్లపై మురుగు నిలవకుండా, దోమల బెడద తగ్గి, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని లబ్ధిదారులు తెలిపారు. ప్రభుత్వం 'దీపం' పథకం కింద సిలిండర్లు అందిస్తున్నప్పటికీ, ఇండక్షన్ స్టవ్ వాడకం ద్వారా గ్యాస్‌పై ఆధారాపడటాన్ని తగ్గించుకుంటున్నామన్నారు. ఇంటిపై ఏర్పాటు చేసిన 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ ద్వారా వచ్చే విద్యుత్‌తోనే ఇండక్షన్ స్టవ్ నడుపుతుండటంతో కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతోందని వివరించారు.

ఈ ఆదర్శ విధానాలను పాటిస్తున్న మహేశ్వరరావు కుటుంబాన్ని ముఖ్యమంత్రి అభినందించి, వారితో సెల్ఫీ దిగారు. అలవరం కోడూరులో అమలవుతున్న నెట్‌జీరో విధానాలను రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు విస్తరింపజేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
Advertisement
Chandrababu Naidu
Net Zero Policy
Alavaram Koduru
Swachhandhra Program
Anakapalli District
Solar Energy Andhra Pradesh

More Telugu News