నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం: జగన్ పై మంత్రి పార్థసారథి ఫైర్

Jagan Mohan Reddy speaks lies and creates anarchy says Minister Parthasarathy
  • డీఎస్సీపై జగన్ అబద్ధాలు.. ఏపీపీఎస్సీ స్కాంను కప్పిపుచ్చేందుకేనని మంత్రి విమర్శలు
  • వైసీపీ హయాంలో ప్లంబర్లు, కూలీలతో గ్రూప్-1 పేపర్లు దిద్దించారని ఆరోపణ
  • ఏపీపీఎస్సీ స్కాంపై సిట్ నివేదికపై బహిరంగ చర్చకు రావాలని జగన్‌కు సవాల్
  • అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారని ఎద్దేవా
  • యువతకు ఉద్యోగాలివ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ
వైసీపీ అధ్యక్షుడు జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు, అడుగు వేస్తే అరాచకం తప్ప మరొకటి ఉండదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీని భ్రష్టుపట్టించిన ఘోరాలను కప్పిపుచ్చుకోవడానికే, నేడు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న మెగా డీఎస్సీపై జగన్, ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత ప్రభుత్వంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 కుంభకోణంపై హైకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన నివేదికపై బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా అని మంత్రి సవాల్ విసిరారు. "నాడు గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించినట్లే, నేడు ఏపీపీఎస్సీ స్కామ్‌ను కప్పిపుచ్చుకోవడానికి మెగా డీఎస్సీపై బురదజల్లడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీపై వైసీపీ నేతలు 300 కేసులు వేయగా, వాటి వెనుక కుట్ర ఉందని న్యాయస్థానమే అభిప్రాయపడింది" అని పార్థసారథి గుర్తుచేశారు.

వైసీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్-1 పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూమ్‌లో కాకుండా, ప్రైవేట్ రిసార్టుకు తరలించి తమకు అనుకూలమైన వారితో మూల్యాంకనం చేయించారని మంత్రి ఆరోపించారు. "ప్లంబర్లు, కార్పెంటర్లు, రోజువారీ కూలీలు, పరీక్ష రాసిన వారి కుటుంబ సభ్యులతోనే పేపర్లు దిద్దించినట్లు సిట్ నివేదికలోనే బట్టబయలైంది. 

జవాబు పత్రాల్లో విచ్చలవిడిగా వైట్నర్ వాడటం, డూప్లికేట్ ఓఎంఆర్ షీట్లు సృష్టించడం ద్వారా అర్హులైన పేద విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎఫ్‌ఎస్‌ఎల్ ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఎంపికైన 165 మంది అభ్యర్థుల్లో 95 శాతం మంది పేపర్లలో తీవ్ర అవకతవకలు జరిగాయని, 89 పత్రాల్లో ఎగ్జామినర్ సంతకాలు కూడా సరిపోలలేదని ఆయన వివరించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకంతోనే 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీకి శ్రీకారం చుట్టారని పార్థసారధి తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించి ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తూ, ఏటా పారదర్శకంగా జాబ్ క్యాలెండర్ అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఐదేళ్లలో చేసిన పాపాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే 11 మంది ఎమ్మెల్యేలున్నా జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. నాడు ఒక్కరైనా లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ, బీజేపీ కిషన్ రెడ్డి అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయకత్వంలో యువత భవిష్యత్తు, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
Advertisement
Jagan Mohan Reddy
Kolusu Parthasarathy
APPSC Group 1 Scam
Mega DSC Andhra Pradesh
Andhra Pradesh Politics
TDP Central Office Mangalagiri

More Telugu News