అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. డీఎంకే సంచలన నిర్ణయాలు..!

DMK sensational decisions following assembly election defeat
  • డీఎంకే పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు
  • కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించడమే ఈ సంస్కరణల ఉద్దేశం
  • బ్రాంచ్‌ పార్టీ కార్యదర్శి పదవికి గరిష్ఠ వయోపరిమితి 45 ఏళ్లు
  • మున్సిపల్‌, సిటీ, టౌన్‌ పంచాయతీ వార్డు కమిటీ కార్యదర్శులకు 50 ఏళ్ల పరిమితి
  • కీలక పదవుల్లో ఎన్నికైన వారు గరిష్ఠంగా రెండు టర్ములు మాత్రమే
డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు చేపట్టారు. పార్టీకి కొత్త రక్తాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పలు కీలక పదవులకు వయోపరిమితి విధించడంతో పాటు.. వరుసగా రెండు పర్యాయాలకు మించి ఆ పదవుల్లో కొనసాగకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.

చెన్నైలో జరిగిన డీఎంకే కార్యవర్గ సమావేశంలో ఈ మార్పులకు సంబంధించిన తీర్మానాలకు ఆమోదం లభించింది. ఈ సంస్కరణలు పార్టీ సంస్థాగత వ్యవస్థలో కొత్త నాయకత్వానికి అవకాశం కల్పిస్తాయని డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నింపుతాయని భావిస్తున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం బ్రాంచ్‌ పార్టీ కార్యదర్శి పదవికి గరిష్ఠ వయోపరిమితిని 45 ఏళ్లుగా నిర్ణయించారు. మున్సిపల్‌, సిటీ, టౌన్‌ పంచాయతీ వార్డు కమిటీ కార్యదర్శుల వయసు 50 ఏళ్లకు మించకూడదు.

టౌన్‌ పంచాయతీ పార్టీ కార్యదర్శులు, ఏరియా కమిటీ కార్యదర్శులు, సిటీ కమిటీ కార్యదర్శులకు గరిష్ఠ వయోపరిమితిని 60 ఏళ్లుగా నిర్ణయించారు. జిల్లా పార్టీ కార్యదర్శుల పదవికి అత్యధికంగా 70 ఏళ్ల వరకు వయోపరిమితి విధించారు.

ఈ పదవుల్లో ఎన్నికైన వారు గరిష్ఠంగా రెండు టర్మ్ లు మాత్రమే కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పార్టీ పదవుల్లో కొత్తవారికి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

స్థానిక సంస్థాగత విభాగాల నిర్మాణంలోనూ డీఎంకే మార్పులు చేసింది. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌లో ఒక్కో ఏరియా కమిటీ పరిధిలో సగటున 40 వేల మంది ఓటర్లు ఉండేలా నిర్ణయించారు. ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఈ సంఖ్యను 30 వేలుగా నిర్ణయించారు. సిటీ కమిటీల పరిధిలో కూడా సగటున 40 వేల మంది ఓటర్లు ఉండేలా తీర్మానం చేశారు.

ఈ మార్పులను డీఎంకే ఎంపీ పి. విల్సన్‌ స్వాగతించారు. ఇవి పార్టీ సంస్థాగత వ్యవస్థలో మంచి నిర్మాణాత్మక సంస్కరణలని, అందరికీ మేలు చేసే నిర్ణయాలని ఆయన పేర్కొన్నారు.
Advertisement
MK Stalin
DMK party reforms
Tamil Nadu politics
DMK age limit rules
DMK organizational changes
DMK leadership restructuring

More Telugu News