గచ్చిబౌలి విషాదం.. అక్రమ భవనాలన్నీ కూల్చేస్తాం: హైడ్రా కమిషనర్

HYDRA Commissioner warns to demolish all illegal buildings after Gachibowli incident
  • గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరి మృతి
  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన కమిషనర్ రంగనాథ్
  • అంజయ్యనగర్‌లోని అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చేస్తామని ప్రకటన
  • సెట్‌బ్యాక్‌లు లేని భవనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడి
హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన నేపథ్యంలో 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్ శనివారం ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలన్నింటినీ నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తామని హెచ్చరించారు.

కేవలం 50 గజాల స్వల్ప విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా ఏడంతస్తుల భవనాన్ని నిర్మించడమే కాకుండా, దానిపై అదనంగా పెంట్‌హౌస్‌‌ను కూడా నిర్మించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బిల్డర్ సాజిద్ నిర్మించే భవనాలన్నీ అత్యంత నాసిరకంగా ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నట్లు కమిషనర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

అంజయ్య నగర్‌ ప్రాంతంలో ఇటువంటి అక్రమ నిర్మాణాలు అనేకం ఉన్నాయని, కనీసం సెట్‌బ్యాక్‌లు కూడా పాటించకుండా బహుళ అంతస్తుల భవనాలను నిర్మించారని రంగనాథ్ పేర్కొన్నారు. నాలాలను ఆక్రమించి ఇష్టారాజ్యంగా కట్టడాలు చేపట్టారని, వీటిలో అధిక శాతం ప్రస్తుతం హాస్టళ్లుగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న ఆయా భవనాలను యజమానులు వెంటనే ఖాళీ చేయాలని ఆయన ఆదేశించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన అన్ని భవనాలను కూల్చివేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.
Advertisement
HYDRA Commissioner Ranganath
Gachibowli building collapse
Hyderabad illegal constructions

More Telugu News