ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు.. సాదిక్ ఖాన్ దొరికాడు!

Sheikh Sadiq Khan arrested in AE Nukaraju family suicide case
  • ఏఈ కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన షూటింగ్ కోచ్
  • భర్తను విషమిచ్చి చంపాడని భార్య సూసైడ్ నోట్
  • ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్, ఆస్తుల కోసం వేధింపులు
  • పరారీలో ఉన్న నిందితుడు షేక్ సాదిక్ ఖాన్
  • ఐదు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలీసులు
రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాదిక్ ఖాన్‌ను కాకినాడ జిల్లా పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న అతడిని ఎట్టకేలకు పట్టుకున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సాదిక్ ఖాన్‌ను కాకినాడకు తరలిస్తున్నట్టు సమాచారం.

అసలేం జరిగిందంటే..
పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న టిల్లాపూడి నూకరాజు, ఆయన భార్య, కుమార్తెతో కలిసి ఈ నెల 16న రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు వారు రాసిన సూసైడ్ నోట్‌లో తమ చావుకు కోచ్ సాదిక్ ఖాన్ వేధింపులే కారణమని స్పష్టంగా పేర్కొన్నారు. తన కుమార్తె సౌజన్యను లోబరుచుకునేందుకు ప్రయత్నించాడని, ముస్లిం మతంలోకి మారాలని ఒత్తిడి చేశాడని, తమ కుటుంబంపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాడని నూకరాజు ఆ లేఖలో ఆరోపించారు.

ఈ ఘటన తర్వాత పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆయన భార్య మీనా మృతదేహం కోసం గాలింపు ఇంకా కొనసాగుతోంది. మనవడు ఎలాగోలా ఈదుకుంటూ బయటపడ్డాడు.

ఐదు బృందాలతో గాలింపు..
నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి సాదిక్ ఖాన్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు కాకినాడ జిల్లా పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, ముంబై నగరాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. పోలీసులను తప్పించుకునేందుకు సాదిక్ ఖాన్ తన సెల్ ఫోన్‌ను ఉపయోగించకుండా, వేర్వేరు ప్రాంతాలకు మారుతూ జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినప్పటికీ, సాంకేతిక ఆధారాలతో అతడి కదలికలను గుర్తించిన పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. 
ఏఈ నూకరాజు మనవడు, కాకినాడలో సాదిక్ ఖాన్ నడుపుతున్న షూటింగ్ అకాడమీలో చేరాడు. దీన్ని అదనుగా చేసుకున్న సాదిక్, నూకరాజు కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. ముఖ్యంగా, నూకరాజు కుమార్తె సౌజన్యకు మాటలతో వల వేసి, ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. క్రమంగా ఆ ఇంటిపై పట్టు సాధించి, ఇంట్లో ఉన్న బంగారం, నగదు, ఏటీఎం కార్డులను కూడా తన నియంత్రణలోకి తీసుకున్నాడు.

సాదిక్ ఖాన్ పెట్టిన తీవ్ర మానసిక హింసను తట్టుకోలేక నూకరాజు కుటుంబం గోదావరి నదిలో దూకింది. అయితే, సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి జూలై 2న మరణించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

జగదీశ్వర్ రెడ్డి మృతిపై అతని తండ్రి భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సౌజన్య రాసిన లేఖలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భర్త జగదీశ్వర్ రెడ్డికి సాదిక్ ఖాన్ విషపూరిత పదార్థం ఇచ్చి చంపాడని ఆమె ఆరోపించింది. తన ప్రైవేట్ ఫొటోలను అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, ఆస్తుల కోసం తనతో పాటు తన తండ్రి నూకరాజును కూడా చంపేస్తానని బెదిరించాడని లేఖలో పేర్కొంది. అంతేకాకుండా, ఇస్లాం మతంలోకి మారాలని తనపై ఒత్తిడి తెచ్చాడని కూడా ఆమె ఆరోపించింది.

భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు సాదిక్ ఖాన్‌పై హత్యాప్రయత్నంతో పాటు మరో ఐదు నేరాల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం తెలియగానే సాదిక్ తన మొబైల్ ఫోన్‌ను వదిలేసి పరారయ్యాడు. ఇతరుల ఫోన్ల నుంచి కాల్స్ చేస్తూ రైలులో పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన మూడు, తూర్పుగోదావరికి చెందిన రెండు పోలీసు బృందాలు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. మృతుడు జగదీశ్వర్ రెడ్డి ఫోన్ కూడా సాదిక్ వద్దే ఉన్నట్లు సమాచారం.

అకాడమీకి వచ్చే యువతులు, బాలికలనే లక్ష్యంగా చేసుకుని "ప్రత్యేక శిక్షణ" పేరుతో సాదిక్ వారిని ఒంటరిగా కలుస్తాడని, శిక్షణ సమయంలో అనుచితంగా ప్రవర్తిస్తాడని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Advertisement
Sheikh Sadiq Khan
AE Nukaraju family suicide case
Kakinada police arrest Delhi
Rifle shooting coach harassment
Godavari River suicide incident
Forced religious conversion allegations

More Telugu News