సున్నం చెరువు రూపురేఖలు మార్చేస్తున్న హైడ్రా.. ఫొటోలు ఇవిగో!

Sunnam Cheruvu looks beautiful as HYDRA transforms its appearance
  • సర్వాంగ సుందరంగా సున్నం చెరువు
  • కబ్జాలు తొలగించి చెరువును 14 నుంచి 30.5 ఎకరాలకు విస్తరణ
  • ఆలయ కమిటీ సహకారంతో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి
  • వాకింగ్ ట్రాక్, పచ్చదనం, ఓపెన్ జిమ్‌లతో పర్యాటక హంగులు
  • త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
హైదరాబాద్ నగరంలోని సున్నం చెరువు రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు మురికికూపంగా, దుర్వాసనతో అల్లాడిన ఈ చెరువును 'హైడ్రా' సుందర సరోవరంగా తీర్చిదిద్దుతోంది. త్వరలోనే ఈ చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒకవైపు బోరబండ బస్తీ, మరోవైపు ఐటీ కారిడార్ మధ్య ఉన్న ఈ చెరువు గతంలో ఆక్రమణల కారణంగా కేవలం 14.20 ఎకరాలకు కుంచించుకుపోయింది. అయితే, హైడ్రా అధికారులు నివాస గృహాలను ఏమాత్రం ప్రభావితం చేయకుండానే, కేవలం కబ్జాలను తొలగించి చెరువును తిరిగి 30.5 ఎకరాలకు విస్తరించారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంతో పాటు, సుమారు 3 మీటర్ల మేర పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించారు. ఫలితంగా దుర్వాసన మాయమై, పరిసర ప్రాంత ప్రజలకు ఉపశమనం లభించింది.

చెరువు ఆవరణలోని ఆంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులను కూడా హైడ్రా చేపట్టింది. ఆలయ కమిటీ ప్రతినిధుల సూచనల మేరకు గోపురం, ప్రదక్షిణ మార్గం, భక్తులు కోసం మార్బుల్ గెజిబో వంటి అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారు. కాగా, ఈ ఆలయాన్ని తొలగిస్తున్నారంటూ కొందరు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులను తాము స్వాగతిస్తున్నామని వారు స్పష్టం చేశారు.

చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం క్రీడా స్థలాలు, పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావరణాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వీటితో పాటు బోటింగ్ సౌకర్యం, సోలార్ లైటింగ్, పటిష్ఠమైన ఫెన్సింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నివసిస్తున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
Advertisement
Sunnam Cheruvu
HYDRA Hyderabad
Revanth Reddy
Madhapur lake restoration
Borabanda lake development

More Telugu News