కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలి.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల డిమాండ్‌!

Dismiss Konda Surekha from Minister post Congress MLAs demand
  • కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆగ్రహం
  • 15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీల భేటీ
  • సుస్మిత వ్యాఖ్యలపై సమావేశంలో తీవ్ర చర్చ
  • వ్యాఖ్యలను సురేఖ ఖండించకపోవడంపై అభ్యంతరం
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఈ అంశంపై ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా సమావేశమై చర్చించారు. అనంతరం కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.

సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను టార్గెట్ చేస్తూ కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆమె వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా సురేఖకు వ్యతిరేకంగా గళం విప్పారు.

సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మాట్లాడారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఇప్పటివరకు ఖండించకపోవడాన్ని ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలపై బాధ్యత వహించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సీఎంను వ్యతిరేకించే వారికి పార్టీలో ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. మీ భాష ఎప్పుడూ పార్టీకి నష్టం కలిగించేలా ఉందని కొండా ఫ్యామిలీని ఉద్దేశించి అన్నారు.

సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ చెప్పడంపైనా ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇచ్చిన వివరణ తమకు ఆమోదయోగ్యంగా లేదని తేల్చారు. సీఎం రేవంత్‌ ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. అలాంటి వ్యక్తిని విమర్శించినప్పుడు ఖండించడం కనీస బాధ్యత అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీని బలహీనపర్చాలనే ప్రతిపక్షాల కుట్రలకు బలం చేకూర్చుతున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్చలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరారు.
Advertisement
Konda Surekha
Telangana Congress MLAs
Revanth Reddy
Konda Sushmita
TPCC President Mahesh Kumar Goud
Telangana Cabinet Dismissal

More Telugu News