మమ్మల్ని చంపేయండి: ఝార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయంపై ఎంపికైన అభ్యర్థుల ఆవేదన
- జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్షలతో పాటు ఇతర నియామక పరీక్షలను రద్దు చేసిన ఝార్ఖండ్ ప్రభుత్వం
- ఆందోళనకు దిగిన 2 వేల మంది ఎంపికైన అభ్యర్థులు
- తమ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని ఆందోళన
ఝార్ఖండ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ పరీక్షలతో పాటు ఇతర నియామక పరీక్షలను రద్దు చేస్తూ తీసుకున్న సంచలన నిర్ణయం తీవ్ర కలకలం రేపుతోంది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ దాదాపు నెల రోజులుగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఈ పరీక్షల ద్వారా ఎంపికై, ఉద్యోగాల్లో చేరిన దాదాపు 2 వేల మంది అభ్యర్థులు తమ భవిష్యత్తు ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లిపోయిందంటూ రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు.
ఎంపికైన అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురవుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు, ప్రభుత్వ నియామక పత్రాల ఆధారంగానే తాము పాత ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇక్కడ చేరామని... ఇప్పుడు హఠాత్తుగా ఉద్యోగాలు ఊడగొట్టడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గరిష్ఠ వయోపరిమితి దాటిపోవడం వల్ల కొత్తగా ఎలాంటి ఉద్యోగ పరీక్షలు రాయలేని పరిస్థితి నెలకొందని... ఇటు పాత ఉద్యోగం లేక, అటు కొత్త ఉద్యోగం ఊడిపోయి తీవ్రంగా నష్టపోయామని కంటతడి పెడుతున్నారు. తమను ఇలా బ్రతికుండగానే చంపేసే బదులు తుపాకీతో కాల్చేయడం మేలని బాధితులు వాపోతున్నారు.
2024 జేఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ నియామకాల ప్రక్రియ మొదటి నుంచి తీవ్ర వివాదాస్పదమైంది. ప్రశ్నాపత్రాల లీకేజీ, ఏజెన్సీ అక్రమాలపై సీఐడీ విచారణ చేపట్టినప్పటికీ... గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అర్హులైన వారికి నియామక పత్రాలు అందజేశారు. అయితే, తాజాగా విద్యార్థుల నిరసనల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఈ పరీక్షలను రద్దు చేయడంతో బాధితులు సచివాలయం ముందు వర్షంలోనే నిరసనలు తెలుపుతున్నారు. వారు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.