దేవాలయ ఉద్యోగాల్లో రాయలసీమకు అన్యాయం జరగలేదు: ఆనం రామనారాయణ రెడ్డి
- రాయలసీమలోని ప్రధాన దేవాలయాల్లో 172 నియామకాలు చేపట్టామన్న ఆనం
- ఉద్యోగాల నియామక ప్రక్రియలో జోనల్ విధానం లేదని స్పష్టీకరణ
- ఖాళీలన్నీ నిబంధనల ప్రకారమే భర్తీ చేస్తున్నామని వెల్లడి
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అర్చకులు, వేద పండితుల నియామకాల్లో రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల భర్తీ చేసిన మొత్తం 344 పోస్టుల్లో ఏకంగా 172 పోస్టులను రాయలసీమ ప్రాంతంలోని ప్రధాన దేవాలయాల్లోనే నియామకాలు చేపట్టినట్లు వెల్లడించారు.
శాసనసభలో దేవాలయాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి వివరంగా సమాధానమిచ్చారు. ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఎలాంటి జోనల్ విధానం అమల్లో లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి సీమలోని ప్రముఖ క్షేత్రాల్లో ఉన్న ఖాళీలను నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నామని తెలిపారు.
ప్రాంతంతో సంబంధం లేకుండా కేవలం వేద, ఆగమ పరిజ్ఞానం, అర్హత, ప్రతిభకే ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి వివరించారు. ఎంపిక విధానం అత్యంత పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూలన్నింటినీ వీడియో రికార్డింగ్ చేయించామని పేర్కొన్నారు. రాయలసీమ జోన్-4 పరిధిలో ఇంకా ఖాళీగా ఉన్న 147 పోస్టులను కూడా త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన వెల్లడించారు.