సీఎం విజయ్ కార్యాలయం మార్పుపై దుమారం.. టెండర్లలో అవినీతిరిగిందంటూ ప్రతిపక్షాల మండిపాటు

CM Vijay office relocation sparks controversy as opposition alleges tender corruption
  • సీఎం విజయ్ కార్యాలయం ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుంచి నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైకి మార్పు
  • రూ. 5.5 కోట్ల టెండర్ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ బీజేపీ, డీఎంకే ధ్వజం
  • పాలనలో పారదర్శకత లోపించిందని ఆరోపణ

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన కార్యాలయాన్ని ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుంచి నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైకి మార్చాలని తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. సీఎం సిబ్బందికి సౌకర్యవంతమైన పని వాతావరణం కల్పించేందుకు ఈ మార్పు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించగా... కొత్త ఆఫీసు పనుల కోసం కేటాయించిన రూ. 5.5 కోట్ల టెండర్ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ బీజేపీ, డీఎంకేలు ధ్వజమెత్తుతున్నాయి.


ఈ వ్యవహారంపై బీజేపీ నాయకుడు కేశవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొత్త ఆఫీస్ పనులు ఇప్పటికే ప్రారంభమైన నెల తర్వాత, ఎలాంటి ఆన్‌లైన్ విధానం అనుసరించకుండా రూ. 5.5 కోట్ల టెండర్‌ను విడుదల చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వచ్చి కేవలం 100 రోజులు కూడా కాకముందే పాలనలో పారదర్శకత లోపించిందని, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కేటాయించడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 


మరోవైపు, డీఎంకే ఎమ్మెల్యే ఈవీ వేలు స్పందిస్తూ.. సీఎం తన కార్యాలయాన్ని మార్చుకోవడం ఆయన వ్యక్తిగత విషయమని, అయితే ప్రజాధనంతో ముడిపడి ఉన్న టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న వార్తలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు.


అయితే, ఈ అవినీతి ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి కేవలం 100 చదరపు అడుగుల స్థలం కూడా లేదని, వారికి మెరుగైన పని వాతావరణం కల్పించేందుకే ఈ తాత్కాలిక మార్పు చేపట్టామని వివరించారు. ఈ పనులకు సంబంధించి టెండర్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన తేల్చిచెప్పారు.

Advertisement
CM Vijay
Tamil Nadu Politics
Office Relocation Controversy
Tender Corruption Allegations
BJP DMK Protest
Namakkal Kavingar Maaligai

More Telugu News