టోల్ ఫ్రీ నెంబర్ పేరుతో కమీషన్లు దండుకుంటున్నారు: పొంగులేటిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు
- 22ఏ నిషేధిత జాబితాలో పొరపాట్లను సరిదిద్దుతామని టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చారన్న ప్రవీణ్ కుమార్
- ఈ టోల్ ఫ్రీ నెంబర్ వెనుక భారీ కుట్ర దాగుందని ఆరోపణ
- నిషేధత జాబితా నుంచి ఆస్తులను తొలగించడానికి 30 శాతం కమీషన్ అడుగుతున్నారని మండిపాటు
హైవేలపై వాహనాల వద్ద టోల్ ఫీజు వసూలు చేసినట్లే.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కమీషన్లు దండుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 22ఏ నిషేధిత జాబితాలో పొరపాటున చేరిన ఆస్తులను సరిచేస్తామని ప్రకటించి తీసుకొచ్చిన 1800 599 4788 టోల్ ఫ్రీ నెంబర్ వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆయన విమర్శించారు.
ఆ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయగానే ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి 30 శాతం కమీషన్ ఇస్తేనే పని పూర్తి చేస్తామని డీల్ మాట్లాడుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు నేరుగా నిధులు వసూలు చేసుకోవడానికి ఈ నెంబర్‌ను ప్రవేశపెట్టారని మండిపడ్డారు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను, చివరకు ఇందిరమ్మ ఇళ్లను కూడా నిషేధిత జాబితాలోకి తీసుకెళ్లి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకే కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టారని విమర్శించారు. గతంలో కలెక్టర్లు, ఎమ్మార్వోలకు తెలియకుండానే పొంగులేటి ‘భూభారతి’ ద్వారా 22 వేల లావాదేవీలు జరిపారని, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అన్నారు.