మంత్రి పొంగులేటి తక్షణమే రాజీనామా చేయాలి: హరీశ్ రావు

Harish Rao demands immediate resignation of Minister Ponguleti
  • రాత్రికి రాత్రే అనేక కాలనీలను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని మండిపాటు
  • పెద్ద తప్పు చేసి క్షమాపణల చెబితే ప్రజల బాధలు తీరవని వ్యాఖ్య
  • కల్యాణలక్ష్మి పథకాన్ని సంతానలక్ష్మి పథకంగా మార్చేశారని మండిపాటు

సమస్యలను పరిష్కరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చిక్కులు సృష్టిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాత్రికి రాత్రే అనేక కాలనీలను 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చడం వల్ల సామాన్య ప్రజలు నరకం చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 22ఏ నిషేధిత భూముల జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో జరిగిన పెద్ద తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిని పదవి నుంచి తొలగించకపోతే... ముఖ్యమంత్రి, మంత్రులు కలిసే ఈ భూదందా చేశారనే అనుమానాలు ప్రజల్లో మరింత బలపడతాయని వ్యాఖ్యానించారు. పెద్ద తప్పు చేసి ఇప్పుడు క్షమాపణలు చెబితే ప్రజల బాధలు తీరవని, అసలు ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చమని ఆదేశించింది ఎవరో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వం చేసిన తప్పులను అధికారుల మీదికి నెట్టి తప్పించుకోవాలని చూడటం సరికాదని, వారు ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ కూడా పనిచేయడం లేదని విమర్శించారు.


భూములను నిషేధిత జాబితాలో పెట్టింది ప్రభుత్వమే కాబట్టి, ప్రజల నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకోకుండా వెంటనే ఆ జాబితా నుంచి తొలగించాలని హరీశ్ రావు స్పష్టం చేశారు. 2008లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూఎల్సీని రద్దు చేయడంతో ఆ స్థలాలు పట్టా భూములుగా మారాయని... అలాగే జీఓల ద్వారా మినహాయింపు పొందిన హెచ్ఎండీఏ, హుడా భూములను కూడా ఇప్పుడు 22A లో చేర్చి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. 


కాంగ్రెస్ పాలనలో కల్యాణలక్ష్మి పథకం ‘సంతానలక్ష్మి’గా మారిపోయిందని, పెళ్లి సమయానికి అందాల్సిన సాయం పిల్లలు పుట్టిన తర్వాత గానీ రావడం లేదని ఎద్దేవా చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తప్పు చేసిన కాంగ్రెస్ నేతలను చట్టపరంగా బాధ్యులను చేస్తామని హెచ్చరిస్తూ, 22A భూముల అంశంపై కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ వేదికగా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.

Advertisement
Harish Rao
Ponguleti Srinivas Reddy
22A Prohibited Lands Telangana
Revanth Reddy
BRS Party Telangana
Kalyana Lakshmi Scheme

More Telugu News