స్వాతంత్య్ర వేడుకల్లో విజయ్‌-త్రిష.. డీఎంకే పత్రిక సంచలన వ్యాఖ్యలు

Vijay and Trisha at Independence Day celebrations DMK newspaper sensational comments
  • విజయ్‌-త్రిషపై ‘మురసోలి’ తీవ్ర వ్యాఖ్యలు
  • స్వాతంత్య్ర వేడుకల్లో త్రిష ముందు వరుసలో కూర్చోవడంపై అభ్యంతరం
  • విజయ్‌కు త్రిష సెల్యూట్‌ చేసిన దృశ్యాలు వైరల్‌
  • ఈ వ్యవహారాన్ని ‘సిగ్గుచేటైన దృశ్యం’గా అభివర్ణించిన మురసోలి
  • త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌-నటి త్రిషకు సంబంధించిన అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో త్రిష పాల్గొనడంపై డీఎంకే అధికార పత్రిక ‘మురసోలి’ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌లో జరిగిన వేడుకల్లో త్రిషను ముందు వరుసలో కూర్చోబెట్టడంపై విమర్శలు గుప్పించింది. ఆమెకు విజయ్‌ పదేపదే సెల్యూట్‌ చేశారని ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని ‘సిగ్గుచేటైన దృశ్యం’గా అభివర్ణించింది.

తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో త్రిష విజయ్‌ తల్లిదండ్రుల పక్కన ముందు వరుసలో కూర్చున్నారు. పసుపు రంగు చీరలో వచ్చిన ఆమె.. విజయ్‌ జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో సెల్యూట్‌ చేశారు. అనంతరం అధికారిక కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొన్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

త్రిష, విజయ్‌ స్నేహంపై చాలా కాలంగా సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మేలో జరిగిన విజయ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా త్రిష హాజరయ్యారు. అక్కడ ఆమె భావోద్వేగానికి గురైన దృశ్యాలు కూడా వైరల్‌ అయ్యాయి. తాజాగా స్వాతంత్య్ర వేడుకల్లో ఆమె కనిపించడంతో ఈ అంశంపై మరోసారి చర్చ మొదలైంది.

ఇటీవల డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ త్రిషపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై విజయ్‌ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) తీవ్రంగా స్పందించింది. ఆగస్టు 4న ఉదయనిధిపై కేసు నమోదై అరెస్టు కూడా అయ్యారు. అదే రోజు ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ‘మురసోలి’ తాజా సంపాదకీయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

విజయ్‌-త్రిష వ్యవహారాన్ని రాజకీయంగా విమర్శించడం ద్వారా విజయ్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మాజీ బీజేపీ నేత కె.అన్నామలై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చాయి. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేందుకు మహిళలను వ్యక్తిగత అంశాల్లోకి లాగడం పాత రాజకీయ ధోరణి అని ఆయన వ్యాఖ్యానించారు.
Advertisement
Vijay
Trisha Krishnan
DMK
Murasoli
Independence Day
Tamilaga Vettri Kazhagam

More Telugu News