'మేక్ ఇన్ ఇండియా' సత్తా.. విదేశాల్లో మారుతి ఫ్రాంక్స్‌కు ఫుల్ డిమాండ్

Maruti Suzuki Fronx sees high demand in international markets under Make in India
  • మారుతి ఫ్రాంక్స్ ఎగుమతుల్లో సరికొత్త మైలురాయి
  • కేవలం 38 నెలల్లో 2 లక్షల యూనిట్ల ఎగుమతి పూర్తి
  • భారత్ నుంచి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఎస్‌యూవీగా రికార్డ్
  • జపాన్‌తో సహా దాదాపు 90 దేశాలకు ఫ్రాంక్స్ ఎగుమతి
  • 'మేక్ ఇన్ ఇండియా' విజయానికి ఇది నిదర్శనమన్న కంపెనీ
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తమ పాపులర్ ఎస్‌యూవీ 'ఫ్రాంక్స్' ఎగుమతుల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 38 నెలల్లోనే 2 లక్షల యూనిట్ల ఎగుమతి మైలురాయిని దాటినట్లు ప్రకటించింది. భారత్ నుంచి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఎస్‌యూవీగా ఫ్రాంక్స్ నిలిచిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

'మేడ్ ఇన్ ఇండియా' ఫ్రాంక్స్ ఎగుమతులు 2023 జూన్ లో ప్రారంభమయ్యాయి. తొలి లక్ష యూనిట్ల ఎగుమతికి 25 నెలల సమయం పట్టగా, ఆ తర్వాత కేవలం 13 నెలల్లోనే మరో లక్ష యూనిట్లను ఎగుమతి చేసి తన వేగాన్ని ప్రదర్శించింది. గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో తయారవుతున్న ఈ మోడల్‌ను జపాన్‌ సహా దాదాపు 90 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా ఎండీ, సీఈఓ హిసాషి టేకుచి మాట్లాడుతూ.. "మారుతి సుజుకి ఎగుమతి చేసే ప్రతి వాహనం మా సిబ్బంది కృషికి, భారత తయారీ రంగానికున్న గర్వానికి ప్రతీక. సుమారు 120 దేశాలకు మేము వాహనాలను ఎగుమతి చేస్తున్నాం. కంపెనీ ఎగుమతుల విజయంలో ఫ్రాంక్స్ కీలక పాత్ర పోషించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది భారత్‌లో నంబర్ 1 ఎగుమతి అవుతున్న ప్యాసింజర్ వాహనంగా నిలిచింది" అని వివరించారు.

అంతర్జాతీయ మార్కెట్లలో ఫ్రాంక్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌కు ఈ వేగవంతమైన వృద్ధే నిదర్శనమని ఆయన అన్నారు. 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' స్ఫూర్తితో భారత తయారీ రంగ పటిమను ప్రపంచానికి చాటుతున్నామని టేకుచి తెలిపారు. వరుసగా ఐదేళ్లుగా ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో మారుతి సుజుకి అగ్రస్థానంలో ఉందని, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతి అయిన మొదటి మూడు ప్యాసింజర్ వాహనాలు తమవేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్రాంక్స్, జిమ్నీ 5-డోర్, ఇ-విటారా, డిజైర్, బాలెనో మోడళ్లు టాప్ ఎగుమతుల్లో ఉన్నాయి. దేశ ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో మారుతి సుజుకి వాటా 55 శాతానికి పైగా ఉండటం విశేషం.
Advertisement
Maruti Suzuki Fronx
Maruti Suzuki India
SUV Exports
Make in India
Hisashi Takeuchi
Hansalpur Plant

More Telugu News