ప్రతి ఆరు నెలలకు ఒక మేజర్ హాస్పిటల్: సీఎం రేవంత్ కీలక ప్రకటన

A major hospital every six months CM Revanth Reddy key announcement
  • సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం
  • ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామని సీఎం రేవంత్ ప్రకటన
  • 2027 చివరి నాటికి 10,000 పడకలు ఏర్పాటు చేయడమే లక్ష్యం
  • 32 నెలల్లో వైద్యంపై రూ.21,800 కోట్లు ఖర్చు చేశామన్న ప్రభుత్వం
  • గత ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమైందని రేవంత్ విమర్శ
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతి ఆరు నెలలకోసారి ఒక ప్రధాన ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా సీఎం కీలక ప్రకటన చేశారు.

ఉస్మానియా జనరల్ ఆసుపత్రి పునర్నిర్మాణంతో పాటు ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2027 డిసెంబర్ నాటికి ఈ ఆసుపత్రులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో అదనంగా 10 వేల పడకలను అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రులకు కేవలం శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకుందని, తమ ప్రభుత్వం వాటిని పూర్తి చేసి ఆచరణలో చూపిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన 32 నెలల పాలనలో ప్రజారోగ్యంపై రూ. 21,800 కోట్లు ఖర్చు చేసిందని, ఇందులో ఆరోగ్యశ్రీ కింద రూ. 2,700 కోట్లు, సీఎం సహాయ నిధి నుంచి రూ. 2,500 కోట్లు వెచ్చించామని తెలిపారు. వైద్యం, విద్యపై పెట్టే ఖర్చును తాము భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడిగా భావిస్తామని ఆయన పేర్కొన్నారు.

అదనపు పని గంటలు కేటాయించే సూపర్ స్పెషాలిటీ వైద్యులకు, సిబ్బందికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల్లో శిక్షణనిచ్చి, అంతర్జాతీయ స్థాయిలో వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఇదే వేదికపై నుంచి 'టీజీ సేఫ్', 'ఆరోగ్య దీపిక' పాలిక్లినిక్‌లను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. వెయ్యి రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసిన నిమ్స్ వైద్య బృందాన్ని, ఆసుపత్రి నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులను ఈ సందర్భంగా సన్మానించారు.                                
Advertisement
Revanth Reddy
TIMS Sanathnagar
Telangana Healthcare Infrastructure
Osmania General Hospital Reconstruction
Arogya Deepika Polyclinics
Telangana Government Hospitals

More Telugu News