తెలంగాణలో 'సర్' ముసాయిదా జాబితా పేర్లను ఎలా చూసుకోవాలి?

How to check names in the SIR draft voter list
  • తెలంగాణలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
  • దాదాపు 73 లక్షల ఓటర్ల పేర్ల తొలగింపుకు ప్రతిపాదన
  • చనిపోయిన, చిరునామా మారిన వారిగా గుర్తింపు
  • ఈసీ వెబ్ సైట్ ద్వారా జాబితాలో పేరు తెలుసుకోవాలి
తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) 2026 ప్రక్రియలో భాగంగా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఇంటింటి సర్వే అనంతరం రూపొందించిన ఈ జాబితాలో, సుమారు 73 లక్షల మంది ఓటర్ల పేర్లు ఏఎస్‌డీడీ (అబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెడ్ అండ్ డూప్లికేట్‌) జాబితాలో ఉన్నట్లు గుర్తించారు.

ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓటర్లు తమ వివరాలను ceotelangana.nic.in వెబ్‌సైట్‌లోని 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026' విభాగంలో లేదా voters.eci.gov.in పోర్టల్‌లో తనిఖీ చేసుకోవచ్చు. జాబితాలో పేరు లేని వారు తగిన ధ్రువపత్రాలతో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, నోటీసులు అందుకున్న వారు నిర్ణీత గడువులోగా స్పందించాలని అధికారులు సూచించారు.

పోలింగ్ బూత్‌ను తెలుసుకోవడం...

హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగడంతో, చాలా మంది ఓటర్ల పాత బూత్ నంబర్లు మారాయి. ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరును వెతుక్కోవడానికి, ఓటర్లు ముందుగా తమకు కేటాయించిన కొత్త బూత్ సంఖ్యను తెలుసుకోవాలి. దీని కోసం ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని సెర్చ్ పోర్టల్‌ను వినియోగించుకోవచ్చు.

ఓటర్లు తమ EPIC (ఓటర్ గుర్తింపు కార్డు) నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లేదా తమ పేరు, బంధువుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను ఉపయోగించి పోలింగ్ బూత్ సంఖ్యను తెలుసుకోవచ్చు. అనంతరం ఈసీఐ వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆ బూత్ నంబర్‌కు సంబంధించిన ఓటర్ల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో సుమారు 2.65 కోట్ల మంది (78.3 శాతం) తమ వివరాలను అందించారు. మిగిలిన 73.3 లక్షల మంది వివరాలు లభ్యం కాకపోవడంతో వారిని మరణించిన, చిరునామా మారిన లేదా నకిలీ ఓటర్ల కేటగిరీ కింద చేర్చారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే 19.4 లక్షల ఓట్లు ఉండటం గమనార్హం.

ఇదిలా ఉండగా, మరో 61.4 లక్షల దరఖాస్తుల్లో లోపాలు ఉన్నట్లు, 32.3 లక్షల మంది వివరాలు పాత జాబితాలతో సరిపోలని అన్‌మ్యాప్డ్ ఓటర్లుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు కేటగిరీల కింద దాదాపు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు.

ఈ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 15 నాటికి అందిన దరఖాస్తులను పరిష్కరించి, అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 36,353కి పెరిగినందున, మెజారిటీ ఓటర్ల బూత్ నంబర్లు మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Advertisement
C Sudarshan Reddy
Telangana Voter List 2026
CEO Telangana Draft List
Special Intensive Revision 2026
Voter ID Status Check

More Telugu News