తెలంగాణ ఓటర్ల జాబితా: పేరు లేకుంటే ఏం చేయాలంటే..?

Telangana Voters List What to do if your name is missing
  • తెలంగాణలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
  • జాబితాలో పేరు లేనివారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • వివరాల్లో తప్పులుంటే ఫారం-8 ద్వారా సరిచేసుకునే అవకాశం
  • అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురణ
తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) 2026కు సంబంధించిన ముసాయిదా జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన వారు ఫారం-6 ద్వారా తిరిగి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు అందాయని, ఇది మొత్తం ఓటర్లలో 78.30 శాతమని అధికారులు వెల్లడించారు. వీరిలో అధిక శాతం ఓటర్లను ఏఎస్‌డీడీ (గైర్హాజరు, చిరునామా మార్పు, మృతి, డూప్లికేట్) కేటగిరీ కింద చేర్చారు. శాశ్వతంగా చిరునామా మారిన వారు, అందుబాటులో లేని వారు, మరణించిన వారు, వేర్వేరు చోట్ల ఓటు హక్కు ఉన్న వారు కలిపి మొత్తం 73,39,235 మంది ఈ కేటగిరీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటింటి సర్వే చేపట్టిన సమయంలో బూత్ స్థాయి అధికారులు ఈ వివరాలను సేకరించారు.

జాబితాలో పేరు లేకుంటే ఏం చేయాలి?

ముసాయిదా జాబితాలో పేరు లేని వారు లేదా ఏఎస్‌డీడీ జాబితాలో ఉన్న వారు కొత్తగా ఓటు నమోదు కోసం ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుతో పాటు వయసు, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి. దరఖాస్తులో పూర్తి పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, కుటుంబ సభ్యులలో ఒకరి వివరాలు, పూర్తి చిరునామా, ఓటర్ ఐడీ నంబర్ (ఉంటే) వంటి సమాచారాన్ని పొందుపరచాలి.

జాబితాలో పేరు ఉండి వివరాలు తప్పుగా ఉంటే..?

ఇప్పటికే జాబితాలో పేరు ఉండి, వివరాల్లో తప్పులు (పేరు, ఫోటో, చిరునామా మార్పు) ఉన్న వారు ఫారం-8 ద్వారా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌ పద్ధతిలో సవరణలు చేసుకోవచ్చు. అభ్యంతరాలు, చేర్పుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఓటర్లు తమ వివరాలను సీఈఓ తెలంగాణ లేదా కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్లలో తనిఖీ చేసుకుని, అవసరమైన మార్పులు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Advertisement
Telangana Voters List
C Sudarshan Reddy
Form 6 Voter Registration
Form 8 Voter Correction
CEO Telangana

More Telugu News