కల్తీకి చెక్.. తెలంగాణలో 'టీజీ సేఫ్' ఏర్పాటు.. ఒకే గొడుగు కిందకు ఆహార, ఔషధ శాఖలు

TG SAFE established in Telangana to merge food and drug departments and curb adulteration
  • ఆహార, ఔషధ నియంత్రణ శాఖలను విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
  • 'టీజీ సేఫ్' పేరిట కొత్త ఏకీకృత అథారిటీ ఏర్పాటు
  • నూతన కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతి నియామకం
  • ఆహార, ఔషధాల కల్తీని అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడటమే లక్ష్యం
  • నియంత్రణ వ్యవస్థల ఆధునికీకరణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు
తెలంగాణలో ఆహార, ఔషధాల నాణ్యతను పర్యవేక్షించేందుకు, కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వేర్వేరుగా పనిచేస్తున్న ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ), ఔషధ నియంత్రణ (డ్రగ్స్ కంట్రోల్) విభాగాలను విలీనం చేస్తూ ఏకీకృత పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఈ కొత్త సంస్థకు 'టీజీ సేఫ్' (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) అని నామకరణం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.

'టీజీ సేఫ్' నూతన కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతిని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ మరో జీవోను విడుదల చేసింది. ఆయన గతంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

రాష్ట్రంలో ఆహార వ్యాపార కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో, నాణ్యత లేని, నకిలీ ఆహార పదార్థాలు, ఔషధాలను నిరోధించి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తన జీవోలో పేర్కొంది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940 కింద నిబంధనల అమలు, పర్యవేక్షణను బలోపేతం చేయడమే ఈ విలీనం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. ఈ రెండు విభాగాల లక్ష్యాలు ప్రజారోగ్యం, వినియోగదారుల భద్రత, నాణ్యతా ప్రమాణాల హామీ వంటి ఉమ్మడి అంశాలతో ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం వివరించింది.

ఈ కొత్త ఏకీకృత వ్యవస్థ కింద డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ అండ్ ప్రాసిక్యూషన్, లేబొరేటరీ, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు పనిచేస్తాయి. అయితే, ఆహార భద్రత, ఔషధ నియంత్రణ చట్టాల ప్రకారం సంబంధిత అధికారుల చట్టబద్ధమైన అధికారాలు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ తరహా ఏకీకృత విధానం ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్నట్లు తెలిపింది.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణ వ్యవస్థలను ఆధునికీకరించేందుకు, ప్రస్తుతం ఉన్న యంత్రాంగాలను సమీక్షించేందుకు ఒక రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వ్యవస్థాగత ఆధునికీకరణ, సర్వీస్ రూల్స్ సమన్వయం, క్షేత్రస్థాయి యూనిట్లు, ప్రయోగశాలల మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలపై ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి, జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ఒక పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థను రూపొందించేందుకు సూచనలు చేస్తుంది.
Advertisement
TG SAFE
Avinash Mohanty
Telangana Food Safety
Drug Control Administration Telangana
Food Adulteration Prevention
Telangana Government News

More Telugu News