జెన్-జీ శక్తితోనే మార్పు.. అవినీతి, కులాలపై పోరాటమే నిజమైన స్వేచ్ఛ: తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో విజయ్
- చెన్నైలోని చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- అవినీతిని అంతమొందించడం రెండో స్వాతంత్ర్య పోరాటం లాంటిదేనన్న విజయ్
- స్వాతంత్ర్య సమరయోధుల పింఛనును రూ. 23 వేలకు పెంచుతున్నట్టు ప్రకటన
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో రాజకీయ ప్రత్యర్థులకు బలమైన హెచ్చరికలు జారీ చేయడంతో పాటు యువత, సామాజిక మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన ఆయన, రాష్ట్రంలో అవినీతిని అంతమొందించడం కూడా ఒక రెండో స్వాతంత్ర్య పోరాటం లాంటిదేనని స్పష్టం చేశారు.
రాష్ట్రాభివృద్ధిలో జెన్-జీ, యువతదే కీలక పాత్ర అని పేర్కొన్న విజయ్... కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సంకెళ్లను తెంచినప్పుడే దేశంలో నిజమైన స్వేచ్ఛ సాధ్యమవుతుందని అన్నారు. తమిళనాడు హక్కులు, భాషా విధానం, ఆర్థిక వాటా విషయంలో తమ ప్రభుత్వం ఏమాత్రం రాజీపడదని... కేంద్ర ప్రభుత్వంతో పరిపాలనాపరమైన సహకారం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ చర్యలనైనా తీవ్రంగా నిరోధిస్తామని హెచ్చరించారు.
ఇదే వేదికపై స్వాతంత్ర్య సమరయోధుల సంక్షేమం కోసం పలు కీలక ప్రకటనలు చేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే పింఛనును రూ. 23 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. అలాగే వీరపాండ్య కట్టబొమ్మన్, వి.ఓ. చిదంబరం పిళ్లై వంటి వీరుల వారసులకు ప్రత్యేక నిధులను ప్రకటిస్తూ, రాబోయే రోజుల్లో సుపరిపాలనతో తమిళనాడును సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తామని తెలిపారు.