‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చూసి ఏడ్చేశా.. ఇది పక్కా హిట్: రాజమౌళి
Advertisement

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చూసి ఏడ్చేశా.. ఇది పక్కా హిట్: రాజమౌళి

SS Rajamouli cried after watching Dont Trouble The Trouble and calls it a sure hit
  • హైదరాబాద్ లో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • హాజరైన ఎన్టీఆర్, రాజమౌళి
  • ఫహాద్ ఫాజిల్ దేశం గర్వించదగ్గ నటుడన్న ఎన్టీఆర్
  • నిర్మాతగా తన తొలి చిత్రానికి ఎన్టీఆర్ రావడంపై కార్తికేయ భావోద్వేగం
  • అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఫాంటసీ ఎంటర్‌టైనర్
  • వేడుకకు హాజరై చిత్ర బృందాన్ని ఆశీర్వదించిన సినీ ప్రముఖులు
ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా, ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో వస్తున్న ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, రాజమౌళి సినిమాపై వ్యక్తం చేసిన బలమైన నమ్మకం అంచనాలను పెంచింది.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మూడేళ్ల క్రితం దర్శకుడు శశాంక్ వచ్చి ‘ఒక దయ్యాన్ని కిడ్నాప్ చేసిన మనిషి కథ’ అని ఒక్క లైన్‌లో చెప్పాడు. ఆ తర్వాత మూడు గంటలు కథ వినిపించాడు. వెంటనే ఓకే చేశాను. ఈ సినిమా చూసి నేను ఏడ్చాను. అంతగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఇది కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఫహాద్ ఫాజిల్ నటన అద్భుతం. ఆయన తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ఇక కార్తికేయ ఒక మంచి బిజినెస్ మ్యాన్. అతను ఉన్నత స్థాయికి వెళతాడు. అక్టోబర్ 2న ప్రేక్షకులు థియేటర్లలో ఒక గొప్ప సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అని ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తమ్ముడు కార్తికేయ నిర్మాతగా తొలి అడుగు వేయడం గర్వంగా ఉందన్నారు. ‘‘గాయం నుంచి కోలుకున్నా, ‘డ్రాగన్’ చెప్పిన సమయానికే విడుదలవుతుంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే, కోవిడ్ సమయంలో ఒక అద్భుతమైన టాలెంట్ మనలోకి వచ్చింది. ఆయనే ఫహాద్ ఫాజిల్. దేశంలో నాకు అతి తక్కువ మంది నటులు ఇష్టం. అందులో మొదటి వ్యక్తి ఫహాద్. ఆయన దేశం గర్వించదగ్గ నటుడు. ఆయన తెలుగులో లీడ్ యాక్టర్‌గా చేస్తున్న తొలి సినిమా గొప్ప విజయం సాధించాలి. దర్శకుడు శశాంక్‌కు, నిర్మాతగా మారిన నా తమ్ముడు కార్తికేయకు ఈ చిత్రం మైలురాయిగా నిలవాలి. ‘బాహుబలి’, ‘ట్రిపులార్’ చిత్రాల విజయం వెనుక కార్తికేయ ఉన్నాడు’’ అని ప్రశంసించారు

నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. తారక్ అన్నను నోరువిప్పి అడగకుండానే, తమ్ముడి సినిమా అని ఈవెంట్‌కు వచ్చి సపోర్ట్ చేసినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఫహాద్ ఫాజిల్ సినిమాలంటే నాకు పిచ్చి. ఆయనతో సినిమా చేయడం అదృష్టం. హైదరాబాద్‌లోని 75 రియల్ లొకేషన్లలో షూటింగ్ చేశాం. ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’’ అన్నారు. హీరో ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ వేడుకలో పాల్గొన్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ‘‘రాజమౌళి అవసరం లేకుండా, శశాంక్‌తోనే 'బాహుబలి’ లాంటి సినిమా తీయగలమని శోభు, ప్రసాద్, కార్తికేయ ఎంతో కసితో ఈ సినిమా తీశారు. ఇది తప్పకుండా హిట్ అవుతుంది’’ అని చమత్కరించారు. సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా సక్సెస్ పక్కా’’ అంటూ ఆశీర్వదించారు. దర్శకుడు శశాంక్, సంగీత దర్శకుడు కాలభైరవ, చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
SS Rajamouli
Fahadh Faasil
Dont Trouble The Trouble
Jr NTR
SS Kartikeya
Shashank Yeleti

More Telugu News