చంద్రబాబు ఒక విజనరీ లీడర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Chandrababu is a visionary leader says President Droupadi Murmu
  • నిజమైన అభివృద్ధికి చంద్రబాబు చిరునామా అన్న ద్రౌపది ముర్ము
  • ఏపీ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంస
  • రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్నారన్న రాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షతపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడిన ఆమె... రాష్ట్రంలో నిజమైన అభివృద్ధికి ఆయనే అసలైన చిరునామా అని స్పష్టం చేశారు. సాంకేతికత, పాలన, మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన చేపట్టిన సంస్కరణలు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు.


ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి, ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి, ఐటీ, పారిశ్రామిక రంగాల పురోగతికి చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దూరదృష్టి కలిగిన నాయకత్వంతో ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన ఈ ప్రశంసలపై టీడీపీ శ్రేణులు, కూటమి నాయకులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.


రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన కుటుంబంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ‘అమరావతి’ కాఫీ టేబుల్ బుక్‌ను బహుకరించారు. ఆ పుస్తకంలోని రాజధాని అమరావతి విశేషాలు, ఫొటోలను రాష్ట్రపతి ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టిని కొనియాడుతూ, ఆయన నిజమైన అభివృద్ధికి చిరునామా అని, ఒక విజనరీ లీడర్ అని రాష్ట్రపతి ప్రశంసల వర్షం కురిపించారు.


అంతేకాకుండా, ఎంపీ అప్పలనాయుడి నిబద్ధతను రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంట్ సమావేశాలకు ప్రతిరోజూ సైకిల్‌పై రావడం, 100 శాతం హాజరు నమోదు చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. సంస్కారం, నిరాడంబరత కలిగిన అప్పలనాయుడిని చూస్తుంటే "నన్ను నేను చూసుకున్నట్లే ఉంది" అని అన్నారు.


Advertisement
Chandrababu Naidu
Droupadi Murmu
Andhra Pradesh
Amaravati
Kalisetti Appala Naidu
Visionary Leader

More Telugu News