గులాబ్ జామున్ నుంచి లడ్డూ వరకు.. వాతావరణ మార్పులతో భారతీయ తీపి పదార్థాలకు గండం!

Climate change poses threat to Indian sweets from Gulab Jamun to Laddu
  • గ్లోబల్ వార్మింగ్ కారణంగా సవాలుగా మారిన మిఠాయిల తయారీ 
  • వేడి ఒత్తిడితో పశువుల్లో పాల దిగుబడి తగ్గి స్వీట్లపై ప్రభావం
  • అకాల వర్షాలు, వేడి గాలులతో శనగ, గోధుమ పంటలకు నష్టం
  • ఎల్ నినో ఎఫెక్ట్‌తో చెరకు సాగు తగ్గి చక్కెర ధరల పెరుగుదల
  • 'క్లైమేట్ ఆన్ మై ప్లేట్' పేరుతో ఇండియా టుడే సైన్స్ విభాగం నివేదిక
మన సంస్కృతిలో, పండుగల్లో వేడుకలకు కేంద్ర బిందువుగా ఉండే నోరూరించే మిఠాయిలు ఇప్పుడు తీవ్రమైన వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. గులాబ్ జామున్, లడ్డూ, కాజూ కట్లీ వంటి సంప్రదాయ స్వీట్ల తయారీకి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రంగా పడుతోంది. దీంతో ముడిసరుకుల నాణ్యత, లభ్యత తగ్గిపోయి, వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఆందోళనకర వాస్తవాలను 'ఇండియా టుడే సైన్స్' విభాగం చేపట్టిన 'క్లైమేట్ ఆన్ మై ప్లేట్' అనే ప్రత్యేక కథనం వెలుగులోకి తెచ్చింది.

వివిధ ముడిసరుకులపై ప్రభావం ఇలా..
వేసవి తీవ్రత, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పాడి పశువులు తీవ్రమైన వేడి ఒత్తిడికి (హీట్ స్ట్రెస్) గురవుతున్నాయి. దీనివల్ల పాల దిగుబడి గణనీయంగా తగ్గడమే కాకుండా, పాలలో కొవ్వు శాతం కూడా పడిపోతోంది. ఇది రసగుల్లా, గులాబ్ జామున్ వంటి పాల ఆధారిత స్వీట్ల తయారీకి అవసరమైన నాణ్యమైన కోవా లభ్యతను దెబ్బతీస్తోంది.

మరోవైపు, లడ్డూల తయారీకి వాడే శనగ పంటలు అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులతో నష్టపోతున్నాయి. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల శనగ గింజ పరిమాణం తగ్గి దిగుబడి తగ్గుతోంది. అలాగే, హల్వా, ఇతర మైదా స్వీట్లకు వాడే గోధుమ పంటలు విపరీతమైన వేడిగాలుల (హీట్‌వేవ్స్) కారణంగా దెబ్బతింటున్నాయి. స్వీట్లకు ప్రాణమైన చక్కెరను ఇచ్చే చెరకు పంటపై ఎల్ నినో, నీటి కొరత ప్రభావం చూపుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చెరకు దిగుబడి తగ్గడంతో చక్కెర ధరలు పెరిగి, స్వీట్ల తయారీ వ్యయం అధికమవుతోంది.

కాజూ కట్లీకి వాడే జీడిపప్పు, స్వీట్లకు సువాసననిచ్చే ఏలకులు, కుంకుమపువ్వు వంటి వాటి సాగుపైనా వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముడిసరుకుల ధరలు పెరగడంతో కొందరు వ్యాపారులు కల్తీకి పాల్పడే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, పండుగల తియ్యదనం తగ్గిపోయి, మన సంప్రదాయ మిఠాయిలు సామాన్యుడికి అందని ద్రాక్షగా మారే రోజు ఎంతో దూరంలో లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Advertisement
Climate Change
Indian Sweets
Global Warming
Food Prices
Agriculture Impact
Traditional Desserts

More Telugu News