రూ.700 కోసం హత్య... రెండు గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Delhi Police solve murder case for 700 rupees within two hours
  • దేశ రాజధాని ఢిల్లీలో ఘటన
  • ప్రధాన నిందితుడు సహా ముగ్గురి అరెస్ట్
  • హత్యకు ఉపయోగించిన కత్తి, ఇతర సాక్ష్యాలు స్వాధీనం

ఢిల్లీలో కేవలం రూ. 700 కోసం తలెత్తిన చిన్న వివాదం ఒక వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. అయితే, ఈ కేసును ఢిల్లీ పోలీసులు కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఛేదించి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. రోహిణి జిల్లా భరత్ విహార్‌కు చెందిన ముకేశ్ యాదవ్ (30) అనే వ్యక్తిపై ఆదివారం బేగంపూర్ విహార్ సమీపంలో కొందరు దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని తొలుత అగ్రసేన్ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముకేశ్ సోమవారం తెల్లవారుజామున 2:18 గంటలకు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతుడి సోదరుడు సతీశ్.. ప్రధాన నిందితుడైన సచిన్ అలియాస్ సాగర్ వద్ద రూ. 700 అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బు తిరిగి ఇవ్వాలని సచిన్.. సతీశ్‌ను నిలదీయగా, ముకేశ్ కల్పించుకున్నాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన సచిన్ తన స్నేహితులతో కలిసి ముకేశ్‌పై కత్తితో దాడి చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.

హత్య జరిగిన రెండు గంటల్లోనే రంగంలోకి దిగిన పోలీసులు, ఏసీపీ సార్థక్ త్యాగి నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. టెక్నికల్ సర్వైలెన్స్ సాయంతో స్థానిక ప్రాంతాలతో పాటు ఓయో హోటళ్లలో తనిఖీలు నిర్వహించి ప్రధాన నిందితుడు సచిన్ (29)తో పాటు పంకజ్ (23), అభిషేక్ (22)లను అరెస్టు చేశారు.

నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్, దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు రోహిణి అదనపు డీసీపీ సతీశ్ కుమార్ తెలిపారు. ప్రధాన నిందితుడు సచిన్‌కు పాత నేర చరిత్ర ఉందని, అతడిపై గతంలోనే 10 దొంగతనం కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.                                
Advertisement
Delhi Police
Mukesh Yadav
Rohini murder case
Sachin alias Sagar
Delhi crime news
700 rupees murder

More Telugu News