అమెరికాలో భారతీయ జ్యువెలరీ షాప్‌లో నిమిషంలోపే కోట్ల రూపాయల ఆభరణాల దోపిడీ

Crore worth jewelry looted within a minute at Indian jewelry shop in New Jersey
  • సుత్తులతో షోకేసులు పగలగొట్టి నలుగురు దుండగుల లూటీ
  • నిమిషంలోపే సుమారు. 9.5 కోట్ల విలువైన ఆభరణాల అపహరణ
  • ఇటీవలి కాలంలో భారతీయ జ్యువెలర్స్‌పై పెరిగిన దాడులు
అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ నగల దుకాణాలే లక్ష్యంగా దుండగులు వరుస దాడులకు తెగబడుతున్నారు. తాజాగా, వుడ్‌బ్రిడ్జ్‌లోని ఒక భారతీయ జ్యువెలరీ స్టోర్‌లో నలుగురు దుండగులు చొరబడి, నిమిషం వ్యవధిలోనే సుమారు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 9.5 కోట్లు) విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానిక ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

శనివారం సాయంత్రం వుడ్‌బ్రిడ్జ్‌లోని '9లఖా జ్యువెలర్స్‌'లోకి నల్లటి దుస్తులు, ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు ప్రవేశించారు. వారు వెంట తెచ్చుకున్న పెద్ద సుత్తులతో షోకేసుల అద్దాలను పగలగొట్టి, అందులోని ఆభరణాల ట్రేలను వేగంగా ప్లాస్టిక్ సంచుల్లో నింపుకొన్నారు. కేవలం 30 నుంచి 45 సెకన్ల వ్యవధిలోనే దోపిడీ పూర్తి చేసి, బయట సిద్ధంగా ఉన్న సిల్వర్ రంగు కారులో పరారయ్యారని దుకాణం సహ యజమాని సోను చౌహాన్ తెలిపారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న నిఘా కెమెరాల్లో రికార్డయ్యాయి.

భారతీయ సంతతి ప్రజలు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో అనేక భారతీయ నగల దుకాణాలు ఉన్నాయి. గతంలోనూ ఇదే వీధిలోని విరాణీ జ్యువెలర్స్‌పై ఇలాంటి దాడులే జరిగాయి. ఈ వరుస ఘటనలపై దుకాణాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేరాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, అధికారులు ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని మరో సహ యజమాని సుష్మిత చౌహాన్ కోరారు. ఇటీవలి కాలంలో పెర్త్ అంబోయ్, జెర్సీ సిటీ వంటి ప్రాంతాల్లోనూ భారతీయ జ్యువెలరీ షాపులను లక్ష్యంగా చేసుకుని 'స్మాష్-అండ్-గ్రాబ్' తరహా దోపిడీలు పెరగడం గమనార్హం.
Advertisement
9Lakha Jewelers
Woodbridge New Jersey
Indian jewelry shop robbery
Smash and grab heist
New Jersey crime news

More Telugu News