ప్రపంచంలో నివాసయోగ్యం కాని నగరాల్లో కరాచీ!

Karachi among the most unlivable cities in the world with bottom rank
  •  ఈఐయూ నివేదికలో కరాచీకి అట్టడుగు స్థానం
  • నివసించలేని నాలుగో అత్యంత అధ్వానమైన నగరంగా కరాచీ
  • 173 నగరాల జాబితాలో 170వ ర్యాంక్
  • భద్రత, మౌలిక వసతుల వైఫల్యమే ప్రధాన కారణం
  • ఆర్థిక కేంద్రమైనా ప్రజలకు తప్పని కష్టాలు
పాకిస్థాన్‌లోని ప్రధాన నగరం, ఆ దేశ ఆర్థిక రాజధాని కరాచీ మరోసారి అపఖ్యాతిని మూటగట్టుకుంది. ప్రపంచంలోనే నివసించడానికి ఏమాత్రం అనుకూలంగా లేని నగరాల్లో ఒకటిగా ఇది నిలిచింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన 'గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2026' (ఈఐయూ) నివేదిక ప్రకారం.. మొత్తం 173 నగరాల జాబితాలో కరాచీ 170వ స్థానంలో నిలిచింది. ఫలితంగా ప్రపంచంలో నివసించలేని నాలుగో అత్యంత అధ్వానమైన నగరంగా కరాచీ రికార్డులకెక్కింది. 

ఈ జాబితాలో కరాచీ కంటే దిగువన బంగ్లాదేశ్‌లోని ఢాకా, సిరియాలోని డమాస్కస్, లిబియాలోని ట్రిపోలి మాత్రమే ఉన్నాయి. నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం.. కరాచీ నగరం 100 పాయింట్లకు గానూ కేవలం 43 స్కోరును మాత్రమే సాధించింది. ముఖ్యంగా స్థిరత్వం (20), సంస్కృతి-పర్యావరణం (36) విభాగాల్లో అతి తక్కువ స్కోరు నమోదు కాగా.. విద్య (75), మౌలిక వసతులు (52), ఆరోగ్యం (54) విభాగాల్లో కొంత మేర మెరుగైన స్కోరును సాధించింది.

నగరంలో మౌలిక సదుపాయాలు, ప్రజా సేవల వైఫల్యమే ఈ దుస్థితికి ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది. తాగునీటి సరఫరా లేకపోవడం, అస్తవ్యస్తంగా ఉన్న ప్రజా రవాణా వ్యవస్థ, దెబ్బతిన్న రోడ్లు, పేరుకుపోయిన చెత్తాచెదారం, పెరుగుతున్న వీధి నేరాలు వంటి తీవ్ర సమస్యలతో నగరవాసులు సతమతమవుతున్నారు.

ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయ లోపం, ప్రాజెక్టుల జాప్యం, నిధుల కొరత, అవినీతి ఆరోపణల కారణంగా కరాచీ నగరం ఏళ్ల తరబడి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పించడంలో విఫలమవ్వడంతో నివాసయోగ్యతలో ఈ నగరం అట్టడుగు స్థానానికి పడిపోయింది.                                
Advertisement
Karachi
Global Liveability Index 2026
Economist Intelligence Unit
Most unlivable cities in the world
Pakistan economic capital
EIU city rankings

More Telugu News