వైసీపీ దీక్షా శిబిరాలపై దాడులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే: బొత్స సత్యనారాయణ
- దీక్షా శిబిరాలపై దాడులు రాజకీయ ఉన్మాదానికి పరాకాష్ఠ అన్న బొత్స
- వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం విచారకరమని వ్యాఖ్య
- నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్
డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ వైసీపీ చేపడుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాలపై దాడులు చేయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలోని దీక్షా శిబిరంపై దాడి చేసి టెంట్లు ధ్వంసం చేయడం, కార్యకర్తలు, మహిళలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేయడం రాజకీయ ఉన్మాదానికి పరాకాష్ఠ అని ఆయన వ్యాఖ్యానించారు. దీక్షా శిబిరం టెంట్‌పై మూత్ర విసర్జన చేయడం, మల్లాది విష్ణును వ్యాన్‌లో తరలిస్తుంటే జెండా కర్రతో దాడికి తెగబడటం రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతోందన్నారు.
దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులే బాధితులైన వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం విచారకరమని బొత్స విమర్శించారు. డీఎస్సీ నియామకాల అక్రమాలపై ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని, ఈ దందాకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం ఎంతగా అణచివేయాలని చూసినా ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగేది లేదని బొత్స స్పష్టం చేశారు.