బొండా ఉమా రౌడీలను పోగేసి దాడికి పాల్పడ్డారు: పేర్ని నాని
- వైసీపీ దీక్షా శిబిరంపై అధికారమదంతో బొండా ఉమా దాడి చేశారన్న పేర్ని నాని
- ఇలాంటి దాడులు రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోతాయని వ్యాఖ్య
- ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్న పేర్ని నాని
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన నిరాహార దీక్షా శిబిరంపై టీడీపీ శ్రేణులు దాడి చేసి టెంట్‌ను తొలగించారంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమా అధికారమదంతో రౌడీలను పోగేసి ఈ దాడికి పాల్పడ్డారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీ జరుపుతున్న ఇటువంటి దాడులు ఒక మాయని మచ్చగా మిగిలిపోతాయని విమర్శించారు.
బొండా ఉమా వంటి రౌడీలను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ శునకానందం పొందుతున్నారని, అయితే ఈ ఆనందం ఎంతో కాలం నిలవదని పేర్ని నాని మండిపడ్డారు. శిశుపాలుడి పాపాలు పండినట్లే చంద్రబాబు ప్రభుత్వ పాపాలను కూడా ప్రజలు లెక్కిస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. "చంద్రబాబును ఏమైనా అంటే ఇళ్లకు వచ్చి కొడతామని బెదిరిస్తున్నారు. మీ చేతనైంది చేసుకోండి, ఎంతమందిని కొడతారో మేమూ చూస్తాం" అంటూ సవాల్ విసిరారు.