24 ఏళ్లకే రూ.13 కోట్ల స్టార్టప్.. రూ.1.8 కోట్లతో ఫ్లాట్ కొన్న యువకుడు!

13 crore startup at age 24 young man buys flat for 18 crore
  • 24 ఏళ్లకే రూ.13 కోట్ల లీగల్-టెక్ స్టార్టప్ స్థాపించిన ఆకాశ్ నారాయణ్
  • బెంగళూరులో రూ.1.8 కోట్లతో తన మొదటి అపార్ట్‌మెంట్ కొనుగోలు
  • ఈ విజయం తన ఒక్కడిది కాదని, కుటుంబం, మిత్రుల వల్లే సాధ్యమైందని పోస్ట్
  • వ్యక్తిగత విజయం కాకుండా సమష్టి కృషిని హైలైట్ చేయడంపై ప్రశంసలు
కేవలం 24 ఏళ్ల వయసులో రూ.13 కోట్ల వార్షిక ఆదాయం కలిగిన స్టార్టప్‌ను నడుపుతున్న ఓ యువకుడు, తన జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాడు. బెంగళూరుకు చెందిన లీగల్-టెక్ స్టార్టప్ 'లీగలిట్' వ్యవస్థాపకుడు ఆకాశ్ నారాయణ్, రూ.1.8 కోట్లతో తన మొదటి అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని కాసాగ్రాండ్ వివాసిటీ ప్రాజెక్టులో ఆకాశ్ ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. దీనిని 2027 ఏప్రిల్‌లో స్వాధీనం చేసుకోనున్నారు. ఈ ఆనందాన్ని పంచుకుంటూ ఆయన ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. "ఈ మైలురాయి నా ఒక్కడిదే కాదు. నా ప్రయాణంలో అండగా నిలిచిన నా కుటుంబం, గురువులు, సహోద్యోగులు, స్నేహితులందరిది. నేను సరైన మార్గంలో వెళ్తున్నానో లేదో తెలియని సమయంలో కూడా నన్ను నమ్మిన అమ్మకు ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. తన తండ్రి, సోదరి, దివంగత తాతయ్య, నానమ్మలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. కష్టకాలంలో తన వెంట నడిచిన టీమ్, మెంటార్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 'ఇది ఆరంభం మాత్రమే'అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

న్యాయవాదులు, న్యాయ సంస్థల కోసం టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే 'లీగలిట్' సంస్థను ఆకాశ్ నారాయణ్ 2023 డిసెంబరులో స్థాపించారు. రిపోర్టుల ప్రకారం.. ఈ సంస్థ వార్షిక స్థూల ఆదాయం సుమారు రూ.13 కోట్లుగా ఉంది. ఆకాశ్ సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ లాలో చదువుకున్నారు. ప్రస్తుతం మణిపాల్ యూనివర్సిటీ జైపూర్‌లో డేటా సైన్స్ అభ్యసిస్తున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడే యాప్‌లు అభివృద్ధి చేయడం, టెక్నాలజీ, బిజినెస్ డెవలప్‌మెంట్, పొలిటికల్ కన్సల్టింగ్ రంగాల్లో పనిచేసిన అనుభవం ఆయనకుంది.

వ్యక్తిగత విజయాన్ని కాకుండా, తన గెలుపు వెనుక ఉన్న సమష్టి కృషిని హైలైట్ చేసిన ఆకాశ్ తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు.
Advertisement
Akash Narayan
Legallit Startup
Bengaluru Entrepreneur
Young Millionaire India
Legal Tech Solutions
Casagrand Vivacity Bangalore

More Telugu News