'అమరజీవి జలధార' గోదావరి జిల్లాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: పవన్ కల్యాణ్
- జల్ జీవన్ మిషన్ కింద అమలవుతున్న 'అమరజీవి జలధార' ప్రాజెక్టు
- తీరప్రాంతాల్లోని 33 లక్షల మందికి సురక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యం
- నిర్దేశిత వ్యవధిలోనే నిర్మాణాలను పూర్తి చేయాలన్న పవన్
జల్ జీవన్ మిషన్ కింద చేపడుతున్న 'అమరజీవి జలధార' ప్రాజెక్టు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
తీరప్రాంతాల్లోని దాదాపు 33 లక్షల మంది ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు పవన్ వివరించారు. నిర్మాణ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు. నిర్దేశిత వ్యవధిలోనే కీలక నిర్మాణాలను పూర్తి చేసి, ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. తీరప్రాంత ప్రజల తాగునీటి భద్రతను నిర్ధారించడంలో జల్ జీవన్ మిషన్ కీలక పాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కొనియాడారు.