మంత్రి నారాయణను సన్మానించిన క్రెడాయ్ ఏపీ ప్రతినిధులు.. జీవో 161పై హర్షం!

Minister Narayana honored by CREDAI AP representatives over GO 161
  • భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ జీవో 161 విడుదల
  • రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లీ ఊపు వచ్చిందన్న క్రెడాయ్ ప్రతినిధులు
  • 'కుడా' మాస్టర్ ప్లాన్‌ను త్వరగా ఫైనలైజ్ చేయాలని మంత్రికి విన్నపం  

ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణను క్రెడాయ్ (CREDAI) ఏపీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సులభతరం చేస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో నంబర్ 161 విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి పూలమాలలతో అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లీ కొత్త ఊపు వచ్చిందని ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. డిక్లరేషన్ విధానం అమలు నుంచి సెట్ బ్యాక్‌ల తగ్గింపు వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నిర్మాణ రంగానికి ఎంతో మేలు చేశాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ చొరవ వల్లే రియల్ ఎస్టేట్ పరిశ్రమ మళ్లీ వృద్ధి పథంలో పయనిస్తోందని కొనియాడారు.


త్వరలో తిరుపతి, రాజమండ్రి నగరాల్లో నిర్వహించనున్న 'క్రెడాయ్ ఎక్స్‌పో'కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని నారాయణకు ఆహ్వాన పత్రికను అందించారు. అలాగే కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) మాస్టర్ ప్లాన్‌ను త్వరితగతిన ఫైనలైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో క్రెడాయ్ ఏపీ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ దాసరి రాంబాబుతో పాటు పలువురు ప్రతినిధులు ఉన్నారు.

Advertisement
Minister Narayana
CREDAI AP
GO 161
Andhra Pradesh Real Estate
Building Permit Rules
Chandrababu Naidu

More Telugu News