ఆలూరు ఎమ్మెల్యేపై కేసు.. ఇది రాజకీయ కక్షసాధింపేనన్న అంబటి రాంబాబు

Ambati Rambabu slams TDP government over illegal case against Alur MLA
  • వైసీపీ నేతలపై కఠిన సెక్షన్లతో కేసులు పెడుతున్నారన్న అంబటి
  • కేసులు, అరెస్టులను ఆయుధంగా వాడుకుంటున్నారని మండిపాటు
  • ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నాని వ్యాఖ్య

టీడీపీ శ్రేణులపై దాడి చేశారనే కేసులో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు మోపిందని మండిపడ్డారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


టీడీపీ నేతలు తప్పులు చేస్తుంటే, వైసీపీ నాయకులపై అక్రమంగా కఠిన సెక్షన్లతో కేసులు పెడుతూ బెయిల్ కూడా రాకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆలూరు ఘటనలో అసలు తప్పు చేసిన వారిని వదిలేసి, బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్కడ టీడీపీ నేతే మహిళపై దాడి చేసి ఆమె బట్టలు చింపినా, అధికార పార్టీ నాయకులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.


కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అంబటి పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను భయపెట్టేందుకు కేసులు, అరెస్టులను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని, అయితే ఎలాంటి బెదిరింపులకు వైసీపీ భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Ambati Rambabu
Alur MLA Virupakshi
YSRCP
TDP Government
Political Vendetta
Andhra Pradesh Politics

More Telugu News