పురుషులను గౌరవించడం మన సంప్రదాయం: టీజీఎస్ఆర్టీసీ బస్సులో బోర్డు!

TGSRTC bus board says respecting men is our tradition
  • టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను ఆకర్షిస్తున్న కొత్త బోర్డు
  • పురుషులను గౌరవించి వారి సీట్లలో కూర్చోనివ్వాలని సూచన
  • ఈ బోర్డుపై టీజీఎస్ఆర్టీసీ నుంచి రాని అధికారిక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) బస్సులో కొత్తగా కనిపించిన బోర్డు ప్రస్తుతం ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది. "పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారి కోసం కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం" అనే సందేశంతో కూడిన ఈ బోర్డు బస్సుల్లో దర్శనమివ్వగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మి' పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరగడంతో, పురుషుల కోసం కేటాయించిన సీట్లలో సైతం ఇతరులు కూర్చుంటున్నారని, దీనివల్ల టికెట్లు కొని ప్రయాణించే పురుషులు నిలబడే ప్రయాణించాల్సి వస్తోందనే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో 'పురుషులను గౌరవించడం మన సంప్రదాయం' అంటూ బోర్డులు ప్రత్యక్షమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ బోర్డుల ఏర్పాటు అధికారికమా కాదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మేడ్చల్, బాలానగర్ డిపోలకు చెందిన పలు బస్సుల్లో ఈ బోర్డులు కనిపించినట్లు సమాచారం.
Advertisement
TGSRTC
Telangana State Road Transport Corporation
Mahalakshmi Scheme
Free Bus Travel for Women
Men Reserved Seats

More Telugu News