జనసేనలోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఏవీ రంగనాథ్.. పవన్ భూవివాదంపై వివరణ

AV Ranganath clarifies on Janasena entry and Pawan Kalyan land controversy
  • రాజకీయాల్లోకి వస్తాననే ప్రచారంలో నిజం లేదన్న ఏవీ రంగనాథ్
  • పవన్ కల్యాణ్ చెరువు భూమిని ఆక్రమించలేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • చిరంజీవి కుటుంబంతో 20 ఏళ్లుగా పరిచయం ఉంద‌ని వెల్ల‌డి
  • ఆయ‌న‌ను హైడ్రా కమిషనర్‌గా తొలగించాలని హైకోర్టు ఆదేశాలు
  • హైకోర్టు తీర్పుపై న్యాయపోరాటానికి సిద్ధమైన తెలంగాణ సర్కార్
తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫుల్‌స్టాప్ పెట్టారు. తన ఉద్యోగాన్ని ప్రశాంతంగా చేసుకోనివ్వాలని కోరుతూ, జనసేన పార్టీలో చేరతాననే వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇటీవల 'రా టాక్స్ విత్ వీకే' అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలపై స్పష్టత ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన కోడి చెరువు భూ వివాదం, తనపై వెలువడిన కోర్టు ధిక్కరణ ఆరోపణలపైనా ఆయన వివరణ ఇచ్చారు.

"నాకు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంతో గత 20 ఏళ్లుగా మంచి పరిచయం ఉంది. పవన్ కల్యాణ్ గారితో కూడా సాన్నిహిత్యం ఉంది. అంతమాత్రానికే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో పోటీ చేస్తానని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌గానూ నన్నే నియమిస్తారని సోషల్ మీడియాలో రాస్తున్నారు. దయచేసి నా ఉద్యోగం నన్ను చేసుకోనివ్వండి. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే నాకు లేదు" అని రంగనాథ్ స్పష్టం చేశారు.

పవన్ భూమి వివాదంపై  వివరణ

గండిపేట సమీపంలోని జన్వాడలో ఉన్న పవన్ కల్యాణ్ భూమిపై చెలరేగిన వివాదంపై రంగనాథ్ సాంకేతిక అంశాలను వివరించారు. కోడికుంట చెరువు వద్ద ఉన్న ఈ భూమి విషయంలో వాస్తవాలను ఆయన వెల్లడించారు.

"పవన్ కల్యాణ్ 2014లో నలుగురు రైతుల నుంచి సుమారు 10 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2015-16లో చెరువుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్, 2023లో ఫైనల్ నోటిఫికేషన్ జారీ అయింది. చాలా మంది కబ్జాదారులు చెరువులను మట్టితో పూడ్చి నిర్మాణాలు చేపడతారు. కానీ, ఈ భూమి విషయంలో అలా జరగలేదు. భూమి సహజ స్వరూపం ఏమాత్రం మారలేదు. నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగలేదు," అని రంగనాథ్ వివరించారు.

అయితే, ఒక సాంకేతిక ఉల్లంఘన జరిగిందని ఆయన అంగీకరించారు. "చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం (FTL) పరిధిలోకి వచ్చేలా ఫెన్సింగ్ వేశారు. ఇది నీటి ప్రవాహాన్ని ఆపకపోయినా, నిబంధనల ప్రకారం తప్పు. అందుకే ఆ ఫెన్సింగ్‌ను తొలగించాలని సూచించాం. ఇలాంటి పట్టా భూములు వేల సంఖ్యలో ఉన్నాయి. సోషల్ మీడియా ఒత్తిళ్లకు తలొగ్గకుండా, అన్ని కేసుల్లో ఒకేలా వ్యవహరిస్తాం," అని స్పష్టం చేశారు. చెరువుల్లోని పట్టా భూములను ఎవరైనా  కొనుగోలు చేయవచ్చు, అమ్ముకోవచ్చు" అని రంగనాథ్ వివరించారు.

ఇదిలా ఉండగా.. ఏవీ రంగనాథ్‌పై దాఖలైన పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టారని మండిపడింది. ఈ క్రమంలో ఆయన్ను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అయితే, హైకోర్టు ఆదేశాలపై న్యాయపోరాటం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది.
Advertisement
AV Ranganath
Pawan Kalyan
Janasena Party
HYDRA Commissioner
Kodi Cheruvu land issue
Telangana High Court

More Telugu News