అప్పుడు క్లాప్ అసిస్టెంట్.. ఇప్పుడు అదే హీరోకి ప్రొడ్యూసర్.. నానిది అసలైన విజయం!

Nani From Clap Assistant To Producer For Nithin Real Success Story
  • నితిన్ హీరోగా నాని నిర్మాణంలో ‘అలియాస్ రుక్మిణీ’
  • 21 ఏళ్ల క్రితం నితిన్ సినిమాకు క్లాప్ అసిస్టెంట్‌గా నాని
  • ఇప్పుడు అదే నితిన్ చిత్రానికి నిర్మాతగా మారిన వైనం
  • నాని సినీ ప్రయాణం స్ఫూర్తిదాయకమంటున్న అభిమానులు
సినీ పరిశ్రమలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఒకప్పుడు క్లాప్ అసిస్టెంట్‌గా పనిచేసిన వ్యక్తి, రెండు దశాబ్దాల తర్వాత అదే హీరోతో సినిమా నిర్మించే స్థాయికి ఎదగడం నిజంగా ఓ అద్భుతం. అలాంటి స్ఫూర్తిదాయక ప్రయాణమే నేచురల్ స్టార్ నానిది. హీరో నితిన్ కథానాయకుడిగా, నాని సమర్పణలో 'అలియాస్ రుక్మిణీ' అనే కొత్త చిత్రం నిన్న‌ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 21 ఏళ్ల క్రితం, 2005లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన 'అల్లరి బుల్లోడు' సినిమాకు నాని క్లాప్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అప్పట్లో నితిన్‌పై చిత్రీకరించిన సన్నివేశాలకు క్లాప్ కొట్టిన నాని, ఇప్పుడు అదే నితిన్ సినిమాకు నిర్మాతగా మారి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టడం విశేషం. ఈ రెండు సందర్భాలకు సంబంధించిన ఫొటోలను పోలుస్తూ.. 'ఇదే కదా అసలైన సక్సెస్' అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

దర్శకుడు కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని, లెజెండరీ డైరెక్టర్ బాపు వద్ద 'రాధా గోపాళం' సినిమాకు, ఆ తర్వాత రాఘవేంద్రరావు వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో పైకొచ్చారు. అనుకోకుండా 'అష్టా చమ్మా' చిత్రంతో హీరోగా మారి, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుచుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో పక్కింటి కుర్రాడిగా స్థానం సంపాదించారు.

ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని, ఇప్పుడు రూ.100 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్‌గా ఎదిగారు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ అభిరుచి గల చిత్రాలను నిర్మిస్తున్నారు. ఒకప్పుడు క్లాప్ అసిస్టెంట్‌గా ఉన్న స్థాయి నుంచి, అదే హీరోతో సినిమా నిర్మించే స్థాయికి ఎదగడం ఆయన పట్టుదలకు, కష్టానికి నిదర్శనం. త్వరలో ఆయన మెగాస్టార్ చిరంజీవితోనూ ఓ సినిమా చేయనుండటం ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది.
Advertisement
Nani
Nithin
Alias Rukmini
Telugu Cinema Success
Anonymous Productions
Murali Kanth

More Telugu News