ఇంగ్లీష్‌ను అధికార భాషగా చేసిన న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌లో లేనిది మనకెందుకంటూ ప్రతిపక్షాల ఎద్దేవా

New Zealand makes English official language as opposition mocks why it is needed when England does not have it
  • న్యూజిలాండ్‌లో అధికార భాషగా ఇంగ్లీష్‌కు చట్టబద్ధమైన గుర్తింపు
  • ఇప్పటికే ఉన్న మావోరీ, సంకేత భాషల సరసన చేరిన ఆంగ్లం
  • ఇది పూర్తిగా అనవసరమైన చర్య అంటూ ప్రతిపక్షాలు, ప్రజల నుంచి విమర్శలు
  • మావోరీ భాష ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నమని ఆందోళన
  • విమర్శలు చేసినప్పటికీ, ప్రతిపక్ష లేబర్ పార్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు
న్యూజిలాండ్‌లో ఇంగ్లీష్‌ను అధికార భాషగా గుర్తిస్తూ ఆ దేశ పార్లమెంట్ గురువారం నాడు ఓ వివాదాస్పద బిల్లును ఆమోదించింది. ఇప్పటికే దేశంలో వాడుకలో ఉన్న మావోరీ (తె రియో మావోరీ), న్యూజిలాండ్ సంకేత భాషల సరసన ఇప్పుడు ఇంగ్లీష్ కూడా అధికారికంగా చేరింది. అయితే, ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పూర్తిగా అనవసరమైన, వనరులను వృధా చేసే చర్య అని ప్రతిపక్షాలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

వివరాల్లోకి వెళితే, అధికార సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నేషనలిస్ట్ పార్టీ 'న్యూజిలాండ్ ఫస్ట్' ఈ బిల్లును బలంగా ముందుకు తెచ్చింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో జరిగిన మూడో విడత చర్చల అనంతరం బిల్లు ఆమోదం పొందింది. వాస్తవానికి, దేశ జనాభాలో 95 శాతం పైగా (దాదాపు 48 లక్షల మంది) ఇంగ్లీష్ మాట్లాడతారు. పార్లమెంట్, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు మొత్తం ఇంగ్లీష్‌లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో, ఇప్పటికే సర్వత్రా వాడుకలో ఉన్న భాషకు అధికారిక హోదా కల్పించడం దేనికని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్రంగా ఎద్దేవా చేశాయి. గ్రీన్ పార్టీ ఎంపీ తమతా పాల్ మాట్లాడుతూ, "మావోరీ భాషను చూసి ప్రభుత్వం భయపడుతోంది. అసలు ఇంగ్లండ్ దేశంలోనే ఇంగ్లీష్ అధికార భాష కాదు" అని చురకలంటించారు. లేబర్ పార్టీ ఎంపీ కమిలా బెలెక్ ఇంకాస్త ముందుకెళ్లి, "ప్రభుత్వం త్వరలో రుతువుల మార్పుపైనా చట్టం చేస్తుందేమో" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విచిత్రం ఏంటంటే, ఇంతగా విమర్శించిన లేబర్ పార్టీ, చివరికి బిల్లుకు అనుకూలంగానే ఓటు వేయడం గమనార్హం.

ఈ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ జరపగా, జస్టిస్ కమిటీకి అందిన 1,601 వినతుల్లో మూడింట రెండొంతుల మంది దీనిని వ్యతిరేకించారు. ఈ చట్టం అనవసర విభజనను సృష్టిస్తుందని, చారిత్రకంగా అణచివేతకు గురై పునరుజ్జీవం పొందుతున్న మావోరీ భాష ప్రాధాన్యాన్ని ఇది తగ్గించవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇది చిన్న విషయం కాదని, అందరూ అనుకుంటున్నదానికి చట్టబద్ధత కల్పించామని సమర్థించుకున్నాయి.
Advertisement
New Zealand
English Official Language
Maori Language
New Zealand Parliament
New Zealand First Party
Official Language Bill

More Telugu News