ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
- నియోజకవర్గంలో భూఆక్రమణలు పెరిగిపోయాయంటూ ధర్నాకు పిలుపునిచ్చిన విశ్వేశ్వర్ రెడ్డి
- ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు
- విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్
అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ నేతల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
ధర్నాను నిరోధించేందుకు ఉరవకొండలోని వైసీపీ కార్యాలయం వద్ద విశ్వేశ్వర్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు ఆయనను వాహనం ఎక్కించిన వెంటనే తీవ్ర ఆగ్రహంతో ఆందోళనకారులు ఆక్సిజన్ సిలిండర్లు, రాళ్లను రోడ్డుకు అడ్డంగా వేసి రాకపోకలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, పోలీసులు విశ్వేశ్వర్ రెడ్డిని అతికష్టం మీద అరెస్టు చేసి గుంతకల్ వైపు తరలించారు.
ఈ చర్యతో మరింత ఆగ్రహానికి గురైన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉరవకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను, ప్రజల రాకపోకలను అడ్డగించడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా శివరామిరెడ్డి కాలనీలో ఉన్న హిందూపురం వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఉరవకొండ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.