శాస్త్రవేత్తలకే సవాలుగా నిలిచిన 10 క్లిష్టమైన సమస్యలు.. పరిష్కరించిన 'ఆస్ట్రా' ఏఐ!

Astra AI solves 10 complex problems that challenged scientists
  • తన కొత్త ఏఐ మోడల్ 'ఆస్ట్రా'ను పరిచయం చేసిన ఓపెన్‌ఏఐ 
  • గణితం, క్వాంటం సైన్స్‌లో 10 క్లిష్టమైన సమస్యలను ఇది పరిష్కరించిన వైనం
  • ఏఐ రూపొందించిన పరిష్కారాలను శాస్త్రవేత్తలు 'లీన్' టూల్‌తో ధ్రువీకరణ‌
  • ఒక్కో పరిష్కారానికి సుమారు 2,000 డాల‌ర్ల కంప్యూటింగ్ ఖర్చు అయినట్లు వెల్లడి
  • ఈ ఫలితాలను సమీక్షించనున్న ప్రపంచ శాస్త్రవేత్తల బృందం
చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్‌ఏఐ మరో సంచలన ప్రకటన చేసింది. తాము ఇంకా విడుదల చేయని 'ఆస్ట్రా' అనే తమ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్, శాస్త్రీయ రంగంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న 10 అతిపెద్ద సమస్యలను విజయవంతంగా పరిష్కరించినట్లు వెల్లడించింది. గణితం, క్వాంటం కాంప్లెక్సిటీ, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ వంటి క్లిష్టమైన రంగాలలో ఈ ఘనత సాధించడం టెక్నాలజీ ప్రపంచంలో చర్చకు దారితీసింది. ఈ వాదనలను ప్రపంచ శాస్త్రవేత్తల సంఘం నిశితంగా పరిశీలించి ధ్రువీకరిస్తే, ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అవుతుంది. కేవలం మనుషులకు సహాయం చేసే డిజిటల్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి శాస్త్రీయ పరిశోధనల్లో భాగస్వామిగా ఏఐ మారుతోందనడానికి ఇది నిదర్శనం.

పరిష్కార ప్రక్రియ ఇలా..
ఈ సమస్యలను 'ఆస్ట్రా' ఎలా పరిష్కరించిందో ఓపెన్‌ఏఐ తన అధికారిక బ్లాగ్‌పోస్ట్‌లో వివరించింది. అత్యంత క్లిష్టమైన గణిత రుజువులను ఈ ఏఐ మోడల్ పూర్తిగా సొంతంగా రూపొందించింది. ఆ తర్వాత, పరిశోధకులు రంగంలోకి దిగి, ఏఐ రూపొందించిన సమాధానాలను 'లీన్' అనే ప్రత్యేక ప్రూఫ్ అసిస్టెంట్ టూల్ సహాయంతో కంప్యూటర్ ద్వారా ధ్రువీకరించే ఫార్మాట్‌లోకి మార్చారు. ఈ ప్రక్రియ ద్వారా ఏఐ ఆలోచనలోని ప్రతి దశను తనిఖీ చేసి, ఎలాంటి తప్పులు లేవని నిర్ధారించుకున్నారు. ఒక్కో సమస్యకు విజయవంతమైన పరిష్కారం కనుగొనడానికి ప్రస్తుత ఏపీఐ ధరల ప్రకారం సుమారు 2,000 డాలర్ల (సుమారు రూ. 1.90 లక్షలు) కంప్యూటింగ్ శక్తి ఖర్చయిందని ఓపెన్‌ఏఐ తెలిపింది.

'ఆస్ట్రా' పరిష్కరించిన సమస్యలు అత్యంత సంక్లిష్టమైనవి. వాటిలో 'నాన్-సోఫిక్ గ్రూప్' అనే ఒక కొత్త గణిత నిర్మాణాన్ని స్పష్టంగా నిర్మించడం కూడా ఉందని ఓపెన్‌ఏఐ పేర్కొంది. దీనితో పాటు క్వాంటం ప్యారలల్ రిపిటీషన్ సిద్ధాంతానికి సంబంధించిన రుజువును అందించింది. అలాగే, ఎర్హార్ట్ వాల్యూమ్ కంజెక్చర్, కోనెస్ రిజిడిటీ కంజెక్చర్ వంటి ప్రఖ్యాత గణిత సిద్ధాంతాలపై కూడా తాజా ఫలితాలను రాబట్టింది. ఈ ఆవిష్కరణలు మానవ మేధస్సుకు సవాలుగా నిలిచిన అంశాలు కావడం గమనార్హం.

గణిత రంగంలో ఓపెన్‌ఏఐ విజయం సాధించడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం, 80 ఏళ్ల నాటి 'ప్లానార్ యూనిట్ డిస్టెన్స్' సమస్యపై తమ ఏఐ మోడల్ ఒక కొత్త పురోగతి సాధించిందని ప్రకటించింది. ఇప్పుడు 'ఆస్ట్రా' సాధించిన ఈ 10 కొత్త పరిష్కారాలు కూడా అదే స్థాయిలో కఠినమైన సమీక్షకు వెళ్లనున్నాయి. ప్రపంచ శాస్త్రవేత్తల బృందం వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ విజయాల ప్రాముఖ్యత ఎంతనేది స్పష్టమవుతుంది. ఏదేమైనా గతంలో యంత్రాలకు అసాధ్యం అనుకున్న పరిశోధన సమస్యలను సైతం ఇప్పుడు ఏఐ వ్యవస్థలు ధైర్యంగా పరిష్కరిస్తున్నాయని చెప్పడానికి ఇది మరో బలమైన నిదర్శనం.
Advertisement
Astra AI
OpenAI
Artificial Intelligence
Mathematics
Quantum Complexity
Computer Science

More Telugu News