టాల్కమ్ పౌడర్ కేసుల్లో మెట్టుదిగిన జాన్సన్ & జాన్సన్.. సెటిల్మెంట్ కోసం వేల కోట్ల‌ ఆఫర్

Johnson and Johnson offers billions to settle talc powder cancer lawsuits
  • టాల్కమ్ పౌడర్ క్యాన్సర్ కేసుల పరిష్కారానికి జాన్సన్ & జాన్సన్ భారీ ఆఫర్
  • సెటిల్మెంట్ కోసం 5.5 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం
  • 95 శాతం మంది బాధితులు అంగీకరిస్తేనే ఈ ఒప్పందం అమలు
  • కేసుల్లో శాస్త్రీయ ఆధారం లేకున్నా.. వివాదానికి ముగింపు పలకడానికే ఈ నిర్ణయం
  • 2023లోనే టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేసిన సంస్థ
తమ టాల్క్ ఆధారిత ఉత్పత్తుల వల్ల 'అండాశయ క్యాన్సర్' బారిన పడ్డామంటూ దాఖలైన వేలాది కేసుల పరిష్కారానికి ప్రముఖ సంస్థ జాన్సన్ & జాన్సన్ ఒక కీలక ముందడుగు వేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ న్యాయపోరాటానికి ముగింపు పలికేందుకు, మిగిలిన కేసులను పరిష్కరించుకోవడానికి 5.5 బిలియన్ డాల‌ర్లు (దాదాపు రూ. 52,676 కోట్లు) వరకు చెల్లించేందుకు ఒక ఒప్పందాన్ని ప్రకటించింది. అయితే, ఈ సెటిల్మెంట్‌కు దాదాపు 95 శాతం మంది బాధితులు అంగీకరించాలనే కీలక షరతు విధించింది.

ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం, 2027లో తొలి విడతగా 3 బిలియన్ డాలర్ల వరకు చెల్లింపులు జరపనుంది. 2028కి ముందు ఎలాంటి అదనపు చెల్లింపులు ఉండవని కంపెనీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. అమెరికాలోని ఫెడరల్, రాష్ట్ర కోర్టులలో పెండింగ్‌లో ఉన్న టాల్క్ సంబంధిత అన్ని కేసులకు ఈ ఒప్పందం వర్తిస్తుంది. ఇదివరకే 'మీసోథెలియోమా' (mesothelioma) వ్యాధికి సంబంధించిన 95 శాతం కేసులను, ఇతర వినియోగదారుల రక్షణ క్లెయిమ్‌లను కంపెనీ పరిష్కరించుకుంది.

ఈ పరిణామంపై జాన్సన్ & జాన్సన్ వరల్డ్‌వైడ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ లిటిగేషన్, ఎరిక్ హాస్ మాట్లాడుతూ.. "ఈ కేసుల్లోని ఆరోపణలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని మేం ఇప్పటికీ గట్టిగా విశ్వసిస్తున్నాం. అయినప్పటికీ, ఈ సుదీర్ఘ న్యాయపోరాటానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే సెటిల్మెంట్‌కు అంగీకరిస్తున్నాం" అని తెలిపారు. 

దశాబ్దాల పరిశోధనలు, స్వతంత్ర నిపుణుల అధ్యయనాలు తమ టాల్క్ ఉత్పత్తుల భద్రతను నిర్ధారించాయని, వాటిలో ఆస్‌బెస్టాస్ లేదని, వాటి వల్ల క్యాన్సర్ రాదని కంపెనీ పునరుద్ఘాటించింది. కాగా, కంపెనీ ఇప్పటికే 2023లో ప్రపంచవ్యాప్తంగా టాల్క్ ఆధారిత జాన్సన్స్ బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేసింది. అదే ఏడాది, తన కన్స్యూమర్ హెల్త్ వ్యాపారాన్ని 'కెన్‌వ్యూ' (Kenvue) పేరుతో వేరు చేసినప్పటికీ, టాల్క్‌కు సంబంధించిన అన్ని చట్టపరమైన బాధ్యతలను జాన్సన్ & జాన్సన్ తనపైనే ఉంచుకుంది. నిర్దేశిత షరతులు నెరవేరితేనే ఈ సెటిల్మెంట్ ఒప్పందం అమల్లోకి వస్తుంది.
Advertisement
Johnson & Johnson
Talc powder lawsuit
Ovarian cancer settlement
Baby powder legal case
JJ compensation offer
Talcum powder cancer claims

More Telugu News