ప్రముఖ రైడ్-హెయిలింగ్ సంస్థ ఉబెర్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను కార్యకలాపాల్లో విస్తృతంగా వినియోగించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తన కస్టమర్ సర్వీస్ విభాగంలో దాదాపు 10 శాతం ఉద్యోగులను తొలగించింది. ఖర్చులను తగ్గించుకోవడం, మరింత సరళమైన సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంస్థ కమ్యూనిటీ ఆపరేషన్స్ విభాగంలో ఈ కోతలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ చాలా విభాగాలుగా విడిపోయి ఉందని, ఇది నెక్స్ట్-జనరేషన్ ఏఐ టెక్నాలజీలను పూర్తిగా వాడుకోవడానికి ఆటంకంగా మారిందని కంపెనీ తన అంతర్గత సమాచారంలో పేర్కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏఐ వినియోగం కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఉబెర్ నేరుగా ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదే విభాగంలోని రిమోట్ ఉద్యోగులు నిర్దేశిత హబ్ కార్యాలయాలకు మారాలని కూడా ఉబెర్ ఆదేశించింది.

గత జూన్ నెలలో కూడా కంపెనీ తమ పీపుల్ డివిజన్‌లో 23 శాతం ఉద్యోగులను తొలగించింది. అయితే, ఏఐ విస్తరణ వల్ల కొత్త నియామకాల వేగం తగ్గుతుందని గతంలో ఉబెర్ సూచించినప్పటికీ, ప్రస్తుతం 500కు పైగా ఉద్యోగ ఖాళీలను ప్రకటించడం విశేషం. ఇందులో అటానమస్ మొబిలిటీ, రోబోట్యాక్సీ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఇంజనీరింగ్ పోస్టులు కూడా ఉన్నాయి.

ఉబెర్ తీసుకున్న ఈ నిర్ణయం, ప్రపంచ టెక్ పరిశ్రమలో కొనసాగుతున్న ఉద్యోగాల కోతల పరంపరలో భాగమే. ఒక నివేదిక ప్రకారం.. 2026 మొదటి ఐదు నెలల్లోనే టెక్ రంగంలో లక్షకు పైగా ఉద్యోగాలు తొలగించబడ్డాయి. ప్రముఖ లేఆఫ్స్ ట్రాకర్ 'లేఆఫ్స్.ఎఫ్వైఐ' (Layoffs.fyi) డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 1,16,739 మంది టెక్ ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. ఉబెర్‌తో పాటు మెటా, క్లౌడ్‌ఫ్లేర్, పేపాల్, సిస్కో, క్వోరా, కాయిన్‌బేస్ వంటి అనేక పెద్ద టెక్ కంపెనీలు కూడా ఖర్చుల ఆప్టిమైజేషన్, పునర్‌వ్యవస్థీకరణ, ఏఐ వినియోగాన్ని పెంచడం వంటి కారణాలతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.