మహిళను వివస్త్రను చేసిన ఘటనపై చంద్రబాబు సీరియస్.. టీడీపీ వ్యక్తిపై వేటు

Chandrababu Naidu reacts seriously to woman assault and suspends TDP member
  • గుంటూరు జిల్లాలో మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటన
  • మహిళలపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరిక
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

గుంటూరు జిల్లాలో ఒక మహిళ పట్ల జరిగిన అమానుష దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ దారుణ ఉదంతం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్న ఆయన.. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా, ఏ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.


సమాజంలో ఏ మహిళను అవమానించినా, వారిపై దాడులకు తెగబడినా అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, అలాంటి అనాగరిక చర్యలకు మన సమాజంలో చోటు లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి, నిందితులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.


ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై ఇప్పటికే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడు మూర్తిని అరెస్టు చేశారు. అతను టీడీపీకి చెందిన వ్యక్తి అని తెలియడంతో... చంద్రబాబు ఏమాత్రం వెనుకాడకుండా అతడిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.


రాజకీయ పార్టీలతో అనుబంధం ఉందనే నెపంతో తప్పు చేసి తప్పించుకోవచ్చని చూస్తే కుదరదని, ఏ ఒక్కరికీ ప్రభుత్వం తరఫున ఎలాంటి రక్షణ లభించదని ముఖ్యమంత్రి కరాఖండిగా తేల్చి చెప్పారు. ఎటువంటి భయం, పక్షపాతం లేకుండా చట్టాన్ని నిష్పక్షపాతంగా, పకడ్బందీగా అమలు చేయడమే తమ ప్రభుత్వ ఏకైక విధానమని స్పష్టం చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మహిళకు తమ గౌరవానికి, భద్రతకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, నూతన సమాజంలో మహిళలు పూర్తి ధీమాతో, రక్షణతో బతకాలన్నదే తమ ఆశయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.


ఘటన వివరాల్లోకి వెళితే... నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే మహిళను వివస్త్రను చేసి, పిడిగుద్దులతో దాడి చేశారు. దాడి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ సదరు మహిళ పోలీసుకు ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేసింది. కానీ ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకొని మూర్తి సహా దాడి చేసిన అందరిని అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
Advertisement
Chandrababu Naidu
Guntur woman assault case
TDP member suspended
Andhra Pradesh women safety
Guntur police arrest
TDP disciplinary action

More Telugu News