ముందు ఎన్సీపీ విలీనం.. తర్వాత ఎన్డీయేలోకి.. మహారాష్ట్రలో బీజేపీ మాస్టర్ ప్లాన్‌!

Sharad Pawar faction likely to join NDA after NCP merger talks
  • ఎన్సీపీ విలీనంపై జోరుగా చర్చలు
  • ముందు విలీనం.. తర్వాత ఎన్డీయే ఫార్ములా
  • 15 రోజుల్లో తుది ప్రకటనకు అవకాశం
  • విలీనం లేకపోతే ప్రత్యేకంగానే ఎన్డీయేలో చేరే ఛాన్స్‌
  • అధ్యక్ష పదవిపై సునేత్రా పవార్‌ పట్టు
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్‌పీ) ఎన్డీయేలో చేరే అవకాశాలపై చర్చలు జరుగుతున్న వేళ.. ముందుగా ఎన్సీపీ రెండు వర్గాలు విలీనం కావాలనే ఫార్ములాను బీజేపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై రెండు వర్గాల మధ్య లోతైన చర్చలు జరుగుతున్నాయని.. 15 రోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెప్పినట్లు ‘న్యూస్‌18’ పేర్కొంది.

2023 జులైలో ఎన్సీపీ చీలిపోయిన తర్వాత అజిత్‌ పవార్‌ వర్గం బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరింది. ఈ ఏడాది బరామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్‌ పవార్‌ మరణించారు. అప్పటి నుంచి రెండు వర్గాల విలీనంపై మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల ఎన్డీయే నేతలు, రెండు ఎన్సీపీ వర్గాల ప్రతినిధులు పలుమార్లు సమావేశమైనట్లు సమాచారం.

ఒకవేళ విలీనం సాధ్యంకాకపోతే.. శరద్‌ పవార్‌ వర్గం ప్రత్యేక పార్టీగానే ఎన్డీయేలో చేరడం లేదా ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలనూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ వర్గానికి చెందిన ఎక్కువ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు నేరుగా ఎన్డీయేలో చేరాలని కోరుకుంటున్నట్లు సమాచారం. కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల్లో భాగమైతే పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారని తెలుస్తోంది.

విలీనం జరిగితే పార్టీ అధ్యక్ష పదవిని సునేత్రా పవార్‌కు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అలాగే మహారాష్ట్ర ఆర్థిక శాఖ తమ వర్గానికే ఇవ్వాలని ఆమె పట్టుబడుతున్నారని, శరద్‌ పవార్‌ వర్గం కూడా అదే శాఖపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు లోక్‌సభ స్థానాల సంఖ్య పెంపు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌లో మళ్లీ ప్రవేశపెట్టాలని ఎన్డీయే భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో లోక్‌సభలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్న శరద్‌ పవార్‌ వర్గం మద్దతు కీలకంగా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Advertisement
Sharad Pawar
NCP Merger
Maharashtra Politics
BJP NDA Alliance
Sunetra Pawar
Maharashtra Government

More Telugu News